సెల్ఫీ హాజరుకు టీచర్ల ససేమిరా

ABN , First Publish Date - 2022-08-17T06:49:46+05:30 IST

ఫేిషియల్‌ స్కానింగ్‌ (సెల్ఫీ) ద్వారా హాజరు వేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

సెల్ఫీ హాజరుకు టీచర్ల ససేమిరా
సీతమ్మధార పీ అండ్‌ టీ కాలనీ ఎన్‌ఎంసీహెచ్‌ పాఠశాలలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న ఉపాధ్యాయులు

తొలిరోజు సగం కంటే తక్కువ మంది రిజిస్ర్టేషన్‌

ఫేిషియల్‌ స్కానింగ్‌ ద్వారా పది శాతంలోపే అటెండెన్స్‌ నమోదు

అనకాపల్లి జిల్లాలో 6,664 మందికి 931 మంది,  అల్లూరి జిల్లాలో 6,610 మందికి 348 మంది, విశాఖ జిల్లాలో 3,064 మందికి 223 మంది హాజరు నమోదు

9 గంటల తరువాత కొద్దిసేపు మాత్రమే పనిచేసిన యాప్‌

ఆ తరువాత మొరాయింపు

అసలు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాల పిలుపు


విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

ఫేిషియల్‌ స్కానింగ్‌ (సెల్ఫీ) ద్వారా హాజరు వేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఉపాధ్యాయుల్లో తొలిరోజు దాదాపు సగం మంది ఫేిషియల్‌ స్కానింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ...రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ మాత్రం పది శాతానికి మించలేదు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత కొద్దిసేపు మాత్రమే యాప్‌ పనిచేయడం, ఆ తరువాత మొరాయించడంతో రిజిస్ర్టేషన్‌కు అవాంతరం ఏర్పడింది. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటలకల్లా పాఠశాలకు వచ్చి సెల్ఫీ ద్వారా హాజరు వేయించుకోవాలంటూ ప్రభుత్వం వారం కిందట ఆదేశాలను జారీచేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అర పూట జీతం కట్‌ చేస్తామని పేర్కొంది. అయితే, ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించొద్దంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచే  వాట్సాప్‌ గ్రూపుల్లో పెద్దఎత్తున మెసేజ్‌లు పెట్టారు. దీంతో మంగళవారం రిజిస్ర్టేషన్‌తోపాటు హాజరు తక్కువగా నమోదైంది. అయితే, అంతక్రితం మాదిరిగా హాజరు వేసుకుంటూ పలువురు ఉపాధ్యాయులు అప్‌లోడ్‌ చేస్తున్నారు. 


లాగిన్‌లో యాప్‌ డౌన్లోడ్‌.. 

ప్రతి టీచర్‌ ముందుగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి లాగిన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ కావాలి. ఆ తరువాత ఎవరికివారు సెల్ఫీ తీసుకుని ఫేిషియల్‌ స్కానింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ రిజిస్ర్టేషన్‌ 50 శాతానికిపైగా నమోదు కాగా, ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లో మాత్రం చాలా స్వల్పంగా అయ్యింది. మొదటిరోజైన మంగళవారం రిజిస్ర్టేషన్‌, ఉపాధ్యాయుల హాజరు వివరాలను పరిశీలిస్తే...అనకాపల్లి జిల్లాలో 6,664 మంది ఉపాధ్యాయులు ఉండగా...4,004 మంది (60.08 శాతం) రిజిస్ర్టేషన్‌ పూర్తిచేశారు. వీరిలో 931 మంది (13.97 శాతం) హాజరు మాత్రమే నమోదైంది. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6,610 మంది ఉపాధ్యాయులుండగా, కేవలం 348 మంది (5.26 శాతం) రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. అందులో 52 మంది (0.79 శాతం) మాత్రమే హాజరు నమోదు చేయించుకున్నారు. విశాఖ జిల్లాలో 3,064 మంది టీచర్లుండగా, 1,571 మంది (51.27 శాతం) రిజిస్టర్‌ అయ్యారు. వీరిలో 223 మంది (7.28 శాతం) మాత్రమే హాజరు నమోదు చేయించుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రిజిస్ర్టేషన్‌ తక్కువగా నమోదు కావడానికి నెట్‌వర్క్‌ సమస్య కారణంగా చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టిసారించినట్టు తెలిసింది. 


ఉన్నతాధికారులతో చర్చలు

ఫేిషియల్‌ స్కానింగ్‌ ద్వారా ఉపాధ్యాయులు హాజరు వేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి  తమ అసంతృప్తిని తెలియజేశాయి. అయినా, ప్రభుత్వం ముందుకువెళ్లడంతో ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. మండలాల్లోని ఉపాధ్యాయ సంఘ నేతలు పలు పాఠశాలలకు వెళ్లి టీచర్లకు సమస్య తీవ్రతను తెలియజేసి, యాప్‌కు దూరంగా ఉండాలని నచ్చజెప్పారు.  ఒకపక్క యాప్‌ డౌన్‌లోడ్‌కు దూరంగా ఉంటూ మరోపక్క ఉపాధ్యాయ సంఘ నేతులు విజయవాడలో విద్యా శాఖ అధికారులతో చర్చలు జరిపారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసే ఈ తరహా నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ కోరినట్టు తెలిసింది. 

Read more