టీడీపీపై కక్షతో పేదల కడుపు కొడతారా?

ABN , First Publish Date - 2022-09-17T06:19:11+05:30 IST

పేదల కడుపు నింపడానికి రూ.5కే భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం కక్షతో మూసివేసి, ప్రజల నోటికాడ కూడు తీసేసిందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

టీడీపీపై కక్షతో పేదల కడుపు కొడతారా?
అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి భోజనాలు వడ్డిస్తున్న కిడారి శ్రావణ్‌కుమార్‌, సియ్యారి దొన్నుదొర, తదితరులు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కిడారి ధ్వజం

అరకులోయలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం


అరకులోయ, సెప్టెంబరు 16: పేదల కడుపు నింపడానికి రూ.5కే భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం కక్షతో మూసివేసి, ప్రజల నోటికాడ కూడు తీసేసిందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజూ ఎంతోమంది కూలీలు, కార్మికులు, వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ప్రజలు అన్న క్యాంటీన్లలో కడునిండా భోజనం చేసేవారని గుర్తు చేశారు. కానీ మాయమాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు, అన్న క్యాంటీలను మూసివేశారని, కనీసం పేరు మార్చి అయినా కొనసాగించాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు సొంత నిధులతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే, పోలీసులతో అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. పైగా వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి అన్న క్యాంటీన్లపై దాడులు చేస్తున్నదని ఆరోపించారు. టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర  అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ప్రజలకు వైసీపీకి గుణపాఠం చెబుతారని, తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను పునప్రారంభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు  శెట్టి లక్ష్మణుడు, శెట్టి బాబూరావు, సాగర సుబ్బారావు, ఇచ్చావతి, అమ్మన్న, కళావతి, లక్ష్మీ, సాయిరాం, వంతల నాగేశ్వరరావు, పాండురంగస్వామి, అప్పలరాజు, ద్రౌపది, తదితరులు పాల్గొన్నారు.

 


Read more