టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా గాడు చిన్నికుమారిలక్ష్మి

ABN , First Publish Date - 2022-10-08T06:40:02+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా గాడు చిన్నికుమారిలక్ష్మి

విశాఖపట్నం, తగరపువలస, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):


ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. ఇదే సమయంలో బీజేపీ తప్ప ప్రఽధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేశాయి. శుక్రవారం తెలుగుదేశం పార్టీ భీమిలికి చెందిన గాడు చిన్నికుమారిలక్ష్మిని తమ అభ్యర్థినిగా ప్రకటించింది. టీడీపీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపినా పార్టీలో పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని ఉత్తరాంధ్ర నేతలు కోరారు. ఈ నేపథ్యంలో అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో సీనియర్‌, భీమిలి మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, ప్రస్తుతం జీవీఎంసీ రెండో వార్డు కార్పొరేటర్‌గా వున్న గాడు చిన్నికుమారిలక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎంపిక చేశారు. తనకు టిక్కెట్‌ కేటాయించినందుకు ఆమె శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌లను కలుసుకుని కృతజ్జతలు తెలిపారు. ఇదిలావుండగా వైసీపీ తరపున సీతంరాజు సుధాకర్‌ను, సీపీఎం తరపున రమాప్రభ పోటీ చేయనున్నారు. కాగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌ బరిలో వుంటారని చెబుతున్నారు. అయితే బీజేపీ అధిష్ఠానం ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. మిగిలిన ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రుల ఎన్నికలో ఓటర్లు ఆరేళ్లకు ఒకసారి తమ ఓటును కొత్తగా నమోదుచేసుకోవాలి. ఈ ఎన్నికలలో ఇదే అత్యంత కీలకం కావడంతో పట్టభద్రుల నుంచి ఓటర్ల నమోదు ఫారాలు స్వీకరించే కార్యక్రమం ఊపందుకోన్నది.


పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటా

గాడు చిన్నికుమారిలక్ష్మి

ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు పార్టీ తనకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా వుందని గాడు చిన్నికుమారిలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తన కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన భర్త అప్పలనాయుడు 1983లో పార్టీలో చేరి అనేక కమిటీల్లో పనిచేశారని గుర్తుచేశారు. పార్టీ అందించిన సహకారంతో 2009లో భీమిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశానన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎమ్మెల్సీగా విజయం సాధిస్తానని, ఇందుకు ఉత్తరాంధ్రలో పార్టీ శ్రేణులు, పట్టభద్రుల సహకారం తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2022-10-08T06:40:02+05:30 IST