దూకుడు పెంచండి

ABN , First Publish Date - 2022-09-10T06:54:51+05:30 IST

దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుందని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలను వివరించడంలో ముందున్నారని...అయితే దూకుడు మరింత పెంచాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.

దూకుడు పెంచండి
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సౌత్‌ ఇన్‌చార్జి గండి బాబ్జీతో నియోజకవర్గంలో పరిస్థితిపై సమీక్షిస్తున్న అధినేత చంద్రబాబునాయుడు

‘సౌత్‌’ ఇన్‌చార్జి గండి బాబ్జీతో చంద్రబాబు

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష


విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):


దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుందని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలను వివరించడంలో ముందున్నారని...అయితే దూకుడు మరింత పెంచాలని  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఇన్‌చార్జి గండి బాబ్జీతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ప్రతి ఇంటిలో ఓటరును కలుసుకునేలా త్వరలో యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దానిని ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. ఈ యాప్‌కు జియోట్యాగ్‌ చేయడంతో ప్రతి ఓటరుకు చెందిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల ఎన్నికల సమయంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఓటర్లకు చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలను పరిశీలించి నియోజకవర్గంలో కొత్తగా చేర్పులు వుంటే వెంటనే చేపట్టాలని సూచించారు. టీడీపీ సానుభూతిపరులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉంటూ బూత్‌ల వారీగా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే తిరిగి చేర్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలో సీనియర్‌లను, కేడర్‌ను సమన్వయం చేసుకుని పార్టీని మరింత పటిష్ఠ చేయాలని బాబ్జీకి సూచించారు. కాగా బాబ్జీ వివరణ ఇస్తూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం చేపడుతున్నామని, నాయకులు, కార్యకర్తలను భాగస్వామ్యులను చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-09-10T06:54:51+05:30 IST