టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు

ABN , First Publish Date - 2022-12-31T01:36:09+05:30 IST

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.

టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు
నాతవరం పోలీసు స్టేషన్‌లో ఉన్న టీడీపీ, జనసేన నాయకులు

నర్సీపట్నం, డిసెంబరు 30 : సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నర్సీపట్నం మునిసిపాలిటీ వార్డు కౌన్సిలర్లు మూలపర్తి రామరాజు, డీబ్బీరు శ్రీకాంత్‌, దనిమిరెడ్డి మధు, మాజీ కౌన్సిలర్లు రావాడ నాయుడు, రుత్తల కృష్ణ, పైల గోవింద్‌, లాలం మురళీ, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీరంగస్వామి. టీడీపీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణలను పోలీసులు అరెస్టు చేసి గొలుగొండకు తరలించారు.

నాతవరంలో..

మండలంలో గురువారం అర్ధరాత్రి సమయంలో టీడీపీ, జనసేన నాయకులను నాతవరం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నర్సీపట్నంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ సభ జరుగుతుండడంతో పోలీసులు వారిని నర్సీపట్నం రాకుండా ముందస్తుగా అరెస్టు చేశారు. గురువారం రాత్రి గునుపూడిలో టీడీపీ జిల్లా కార్యదర్శి కోండ్రు మరిడియ్య, తెలుగు యువత మండల అధ్యక్షుడు శెట్టి లోవలను అరెస్టు చేశారు. అలాగే జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన సూర్యచంద్రను లక్ష్మీపురంలో అరెస్టు చేశారు.

బుచ్చెయ్యపేటలో..

నర్సీపట్నంలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మండలంలోని తెలుగుదేశం నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావులను గృహనిర్బంధం చేశారు.

చీడికాడలో..

నర్సీపట్నంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి సభను అడ్డుకునేందుకు వెళుతున్న టీడీపీ మండల నాయకులను శుక్రవారం ఉదయం అరెస్టు చేసి పూచికత్తుపై విడుదల చేశామని స్థానిక ఎస్‌ఐ కె.సుధాకర్‌రావు తెలిపారు.పార్టీ మండల అధ్యక్షులు పోతల చిన్నంనాయుడు, టీడీపీ నాయకులు గాలి బాలకృష్ణలను అరెస్టు చేసి, విడుదల చేశామన్నారు.

కె.కోటపాడులో..

జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో మండలంలోని పైడంపేటలో టీడీపీ మండల అధ్యక్షుడు రొంగలి మహేష్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించినప్పుడల్లా తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు.

మాడుగుల రూరల్‌లో...

తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉండూరు దేముడును పొంగలిపాకలో ఇంటి వద్ద పోలీసులు శుక్రవారం ఉదయం గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా దేముడు మాట్లాడుతూ.. నర్సీపట్నంలో సీఎం సభకు హాజరు కాకుండా ఉండేందుకు తనను హౌస్‌ అరెస్టు చేశారన్నారు.

Updated Date - 2022-12-31T01:36:09+05:30 IST

Read more