ఐటీ హిల్స్‌లో భూ దందాపై టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2022-04-05T06:25:14+05:30 IST

మధురవాడ ఐటీ హిల్స్‌లో కోట్లాది రూపాయల భూ దందా జరిగిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం ఐటీ హిల్స్‌ సెజ్‌లో జీపీఆర్‌ఎల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో ధర్నా చేశారు.

ఐటీ హిల్స్‌లో భూ దందాపై టీడీపీ ఆందోళన
ఐటీ హిల్స్‌ సెజ్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని రూ.97 కోట్లకు ధారాదత్తం చేయడం దారుణం

టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు

సాగర్‌నగర్‌, ఏప్రిల్‌ 4: మధురవాడ ఐటీ హిల్స్‌లో కోట్లాది రూపాయల భూ దందా జరిగిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం ఐటీ హిల్స్‌ సెజ్‌లో జీపీఆర్‌ఎల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ విశాఖ పార్టమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.1,500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.97 కోట్లకే ధారాదత్తం చేసి సేల్‌ డీడ్‌ చేయడం దారుణమన్నారు. ఎంతో విలువైన ఈ భూమిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్‌ చేశారని విమర్శించారు. ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా ఈ భూములకు వేలం వేస్తే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు. జీపీఆర్‌ఎల్‌ సంస్థకు గతంలో ఇచ్చిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేసి సేల్‌ డీడ్‌తో ధారాదత్తం చేశారన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విలువైన భూములను కారుచౌకగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే కంపెనీలకు కట్టబెట్టడం భావ్యం కాదన్నారు. ఐటీ భూములను సైట్‌ ఎట్‌ సేల్‌ పద్ధతిలో వేలానికి పెట్టాలని డిమాండ్‌ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు తీసుకువచ్చే అదానీ డేటా సెంటర్‌ను కాదని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూ కేటాయింపులు చేయడంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా విక్రయిస్తుండడం శోచనీయమన్నారు. ఈ భూ దందాలో అతిపెద్ద స్కామ్‌ దాగి వుందని, ఇందులో రాష్ట్ర మంత్రితో పాటు పలువురు అధికారులు, ఎన్‌బీసీసీ సంస్థ ప్రమేయం వుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ‘దక్షిణ’ ఇన్‌చార్జి గండి బాబ్జి, ‘భీమిలి’ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, నాయకులు పాశర్ల ప్రసాద్‌, చిక్కాల విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-04-05T06:25:14+05:30 IST