ఆటోలపై బాదుడు

ABN , First Publish Date - 2022-02-23T05:54:27+05:30 IST

పెందుర్తికి చెందిన ఏపీ 31 టీహెచ్‌ 0880 నంబర్‌ గల ఆటోను ఇటీవల రవాణా శాఖ అధికారులు గురుద్వార జంక్షన్‌ వద్ద తనిఖీ చేశారు.

ఆటోలపై బాదుడు

భారీగా జరిమానాలు

పర్మిట్‌ లేకపోతే రూ.10,000

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే రూ.5,000

జీవో నంబర్‌ 21 ప్రకారం కేసులు నమోదుచేస్తున్న రవాణాశాఖ అధికారులు

‘వాహనమిత్ర’ కింద ఇచ్చే మొత్తం

ఒకసారి జరిమానాతో వెనక్కి పోతుందంటున్న ఆటోవాలాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పెందుర్తికి చెందిన ఏపీ 31 టీహెచ్‌ 0880 నంబర్‌ గల ఆటోను ఇటీవల రవాణా శాఖ అధికారులు గురుద్వార జంక్షన్‌ వద్ద తనిఖీ చేశారు. ఆటోకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పర్మిట్‌ లేకపోవడంతో ఏకంగా రూ.12 వేలు జరిమానా విధిస్తూ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ-చాలాన్‌ జారీచేశారు.

ఆనందపురానికి చెందిన ఏపీ 31టీఈ 5538 నంబర్‌ గల ఆటోకు ఫిట్‌నెస్‌, పర్మిట్‌ లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు రూ.15 వేలు జరిమానా విధిస్తూ ఈ-చలాన్‌ జారీచేశారు.

...ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించని ఆటోలు, ఇతర వాహనాలకు జరిమానాలు విధించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే ఏకంగా రూ.15 వేలు, రూ.20 వేలు జరిమానాలు విధించడంపైనే ఆటోవాలాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో 29 వేలు ఆటోలు, రూరల్‌ జిల్లాలో మరో 15 వేలు ఆటోలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజూ రోడ్లపై తిరుగుతుంటాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా, నిబంధనలు పాటించని వాహనాలపై పోలీస్‌ శాఖతోపాటు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదుచేసి జరిమానా విధిస్తుంటారు. చాలాకాలంగా ఈ విధానం నడుస్తోంది. అయితే రోడ్డుప్రమాదాల నియంత్రణలో భాగమంటూ మోటార్‌ వాహనాల చట్టం-1988కి కొన్ని సవరణలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్‌ 21ను జారీచేసింది. గత ఏడాదికాలంగా దీనిని అమలు చేయడం ప్రారంభించారు. దీని ప్రకారం నిబంధనలు పాటించని వాహనాలకు అధికారులు భారీగా జరిమానా విధిస్తున్నారు. ముఖ్యంగా ఆటోలు అయితే నిర్దాక్షిణ్యంగా జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోతే రూ.750, ఆర్టీసీ బస్టాపుల వద్ద ప్రయాణికులను ఎక్కిస్తే రూ.500, తనిఖీ అధికారులకు పత్రాలను సకాలంలో అందించలేకపోతే రూ.750, లైసెన్స్‌ లేకుండా ఆటో నడిపితే రూ.ఐదు వేలు, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఆటో నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.1,500, రెండోసారి అయితే రూ.పది వేలు, రిజిస్ర్టేషన్‌/ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా ప్రయాణికులను ఎక్కిస్తే రూ.ఐదు వేలు, పర్మిట్‌ లేకపోతే రూ.పది వేలు, ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.రెండు వేలు నుంచి రూ.నాలుగు వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. 


వాహనమిత్రకు మూడు రెట్లు ఎక్కువే ఖాళీ

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోలను సొంతంగా నడిపే వారికి ‘వాహనమిత్ర’ పేరుతో ఏటా రూ.పది వేలు చొప్పున ఆర్థిక సహాయం ఇస్తోంది. అయితే ఆ మొత్తానికి మూడు రెట్లు ఎక్కువ రాబట్టుకునేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆటోవాలాలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పాటించని ఆటోలు, ఇతర వాహనాలను వదిలేయాలని ఎవరూ కోరనప్పటికీ, రోజువారీ ఆదాయంపై కుటుంబాలను పోషించుకునే వారిపై వేలకు వేలు జరిమానాలు విధించడం ఎంతవరకూ న్యాయమో అధికారులు ఆలోచన చేయాలని కోరుతున్నారు.


వాహనమిత్రకు మూడు రెట్లు ఎక్కువ లాగేస్తున్నారు

వామనమూర్తి, ఏపీ ఆటో అండ్‌ మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి

ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.పది వేలు ఇస్తోందనే సంతోషం కంటే అంతకు మూడు రెట్లు ఎక్కువ జరిమానాల రూపంలో లాగేస్తోంది. ఆటోలకు చిన్నపాటి లొసుగులు ఉన్నా...మానవతా దృక్పథంతో చూడకుండా భారీ జరిమానాలు విధించి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఆటోలకు పర్మిట్లు, ఫిట్‌నెస్‌లు రెన్యువల్‌ కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళితే అక్కడి సిబ్బంది అధికారుల పేరు చెప్పి లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వకపోతే ఏదో సాకు చూపించి తిరస్కరించేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడంపై అధికారులు దృష్టిపెట్టాలి. 


రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగానే...

రాజారత్నం, జిలా రవాణాశాఖ ఉప కమిషనర్‌

రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగానే నిబంధనలు అతిక్రమించే వాహనాలకు జరిమానాలు విధిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే జరిమానా మొత్తం పెరిగిందనే విషయం తెలుసుకోవాలి. ఒక్క ఆటోలే కాదు నిబందనలు పాటించని అన్ని  వాహనాలకు జరిమానా విధిస్తున్నాం. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా..సామాజిక భద్రత కోణంలో చూడాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 


జీవో నంబర్‌ 21 ప్రకారం మోటారు వాహనాల ఉల్లంఘనపై రవాణా శాఖ నిర్దేశించిన జరిమానాలు

ఉల్లంఘన జరిమానా

నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోవడం రూ.300 నుంచి రూ.750

స్టేజీల్లో ప్రయాణికులను ఎక్కిస్తే రూ.500

తనిఖీ అధికారులతో దురుసు ప్రవర్తన రూ.750

సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే రూ.750

లైసెన్స్‌ లేకుండా ఆటో నడిపితే రూ.5,000

లైసెన్స్‌ సస్పెండ్‌ అయిన వ్యక్తి నడిపితే రూ.10,000

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఆటో నడిపితే రూ.1,500,

రెండోసారి అయితే రూ.10,000

రిజిస్ర్టేషన్‌/ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకుంటే రూ.5,000

పర్మిట్‌ లేకపోతే... రూ.10,000

ఇన్సూరెన్స్‌ లేకపోతే మొదటిసారి రూ.2,000

రెండోసారి పట్టుబడితే.... రూ.4,000

Updated Date - 2022-02-23T05:54:27+05:30 IST