రాజధానిపై చర్చ

ABN , First Publish Date - 2022-03-04T06:25:32+05:30 IST

రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని, అక్కడి నుంచి ఒక్క కార్యాలయం కూడా తరలించడానికి వీల్లేదంటూ గురువారం రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పుపై అధికార వర్గాల్లో చర్చ మొదలైంది.

రాజధానిపై చర్చ

సర్కారు వారికి షాక్‌

విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి ఉవ్విళ్లూరిన వైసీపీ

కార్యాలయాల కోసం నగరంలో భవనాల గుర్తింపు

తరలింపునకు ఏర్పాట్లు

నివాసాల కోసం శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌లో విల్లాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన పలువురు ఉన్నతాధికారులు

ఉగాది నుంచి కార్యకలాపాలంటూ అధికార పార్టీ ప్రకటనలు

 రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పుతో అధికారుల్లో చర్చ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని, అక్కడి నుంచి ఒక్క కార్యాలయం కూడా తరలించడానికి వీల్లేదంటూ గురువారం రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పుపై అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. 

విశాఖపట్నం నుంచి పరిపాలనా సాగించాలని అధికార పార్టీ చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంది. పలు శాఖల కార్యాలయాలను విశాఖపట్నం తీసుకురావడానికి నిర్ణయాలు జరిగిపోయాయి. డీజీపీ కార్యాలయం కోసం రుషికొండ ఐటీ పార్కులో ఒక భవనాన్ని మాట్లాడుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌ను ఆనుకొని వున్న ఏలేరు గెస్ట్‌హౌస్‌లో ఇరిగేషన్‌ కార్యాలయం పెట్టాలనుకున్నారు. పురపాలక శాఖ మంత్రిత్వ శాఖ కోసం సిరిపురం జంక్షన్‌లోని వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్‌లో అనేక ప్రభుత్వ శాఖలను ఖాళీ చేయించారు. పిఠాపురం కాలనీలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని రెండేళ్లుగా ఎవరికీ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. పలువురు అధికారులు తమ నివాసాల కోసం ఎండాడలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌లో విల్లాలకు అడ్వాన్స్‌లు  ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఏకంగా రుషికొండలో పర్యాటక శాఖ అధికారులు హరిత రిసార్ట్‌ను కూలగొట్టి రూ.100 కోట్ల భారీ భవన సముదాయ నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోనే అతి పెద్ద అతిథి గృహం నిర్మాణానికి కాపులుప్పాడలో శ్రీకారం చుట్టారు. ఉగాది తరువాత ఏ క్షణాన్నైనా విశాఖపట్నం నుంచి సీఎం పరిపాలన మొదలవుతుందంటూ ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో... ఇప్పుడు ఏమి జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


రాజధాని రాదని జగన్‌కూ తెలుసు

బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి, తెలుగుదేశం

విశాఖలో రాజధాని ఏర్పాటు అసాధ్యమని జగన్‌కు కూడా తెలుసు. ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికే పరిపాలనా రాజధాని ప్రకటన చేశారు. ఈ రెండున్నర ఏళ్లలో విశాఖకు వైసీపీ చేసిందేమీ లేదు. లూలూను వెళ్లగొట్టారు. గంగవరంలో వాటా అమ్మేశారు. భూములు తాకట్టు పెట్టేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు తేలేదు. ఇక్కడి ప్రజల్ని మభ్య పెట్టడానికి వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో విశాఖలో పరిపాలనా రాజధాని అంటారు. ఇదంతా మోసం.


హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా దానిని అమలు చేయాలి. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. వాటి కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలి. సమన్వయం ముఖ్యం. ఉత్తరాంధ్రాను అభివృద్ధి చేయడానికి ఇక్కడ రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు. 


అమరావతే రాజధాని

పి.విష్ణుకుమార్‌రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ

అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని. హైకోర్టు తీర్పుతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. రాజధాని పేరుతో విశాఖలో వ్యాపారం చేశారు. భూములు చేజిక్కించుకున్నారు. విశాఖకు వైసీపీ చేసిందేమీ లేదు. దేవుడి ఆలయాన్ని కూడా ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారు.  


ఏ ఆఫీసు మార్చడానికి వీల్లేదు

బొలిశెట్టి సత్య, జనసేన నాయకులు

హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుతం అమరావతిలో వున్న ఏ రాష్ట్ర స్థాయి కార్యాలయాన్ని కూడా అక్కడి నుంచి తరలించడానికి వీల్లేదు. విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స, సలహాదారు సజ్జల చెప్పినట్టు కార్యాలయాలను విశాఖలో పెట్టడానికి అవ్వదు. రాజ్యాంగం పరిధిలోనే ప్రభుత్వం పనిచేయాలి. రాజధాని రైతులు ఇన్నాళ్లూ పడిన కష్టానికి, బాధలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

Read more