తగ్గని జోరు

ABN , First Publish Date - 2022-10-08T06:23:47+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

తగ్గని జోరు
వర్షపు నీరు నిలిచి చెరువుగా మారిన చోడవరం మెయిన్‌ రోడ్డు

జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు

పలు ప్రాంతాల్లో కుండపోత

పూర్తిగా నిండిన జలాశయాలు

భారీగా చేరుతున్న వరదనీరు.. గేట్లు ఎత్తివేత

ఉగ్రరూపం దాల్చిన నదులు

రహదారులు జలయమం.. గోతులతో మరింత ఛిద్రం

ముసురుతో జనజీవనానికి అంతరాయం

గొలుగొండ మండలం ఎరకంపేటలో నది దాటుతూ వృద్ధురాలి మృతి(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా చోడవరం, మాడుగుల, నర్సీపట్నం అసెంబ్లీ నియోజవర్గాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా కుండపోతగా వాన పడింది. మిగిలిన ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొని జల్లులు పడ్డాయి.  జలాశయాలన్నీ ఇప్పటికే నిండడం, వరద ప్రవాహం కొనసాగుతుండడంతో స్పిల్‌వే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శారదా, పెద్దేరు, బొడ్డేరు, సర్పా, వరాహ, తాండవ, తాచేరు తదితర నదులతోపాటు గెడ్డలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రోడ్లపై గోతుల్లో నీరు చేరడంతో ఏ గొయ్యి ఎంత లోతు వుందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జనజీవనానికి ముసురు వాతావరణం ఆటంకం కలిగించింది. 

చోడవరం మండలంలో నాలుగో రోజైన శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. పలు వీధుల్లో మోకాటిలోతున నీరు నిలిచింది. భారీ గోతులు ఏర్పడి, వర్షపు నీరు నిలిచిపోయిన మెయిన్‌ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. జిల్లాలో అతిపెద్ద దైన లక్ష్మీపురం చెరువు పూర్తిగా నిండిపోయి పొర్లుగట్టుపై నుంచి వరద నీరు పారుతున్నది. బుచ్చెయ్యపేట మండలంలో సుమారు 100 ఎకరాల్లో వరి పైరు నీటమునిగింది. పెద్దేరు, తాచేరు, బొడ్డేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  

గొలుగొండ మండలం ఎరకంపేట గ్రామానికి చెందిన బందర సత్యవతి(60) గురువారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూ వరహా నదిలో కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం గుండుపాల గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మండలంలో రాళ్లగెడ్డ, ధారగెడ్డ పొంగి ప్రవహించాయి. ఇదే మండలం పాతకృష్ణాదేవిపేటలో గురువారం అర్ధరాత్రి వజ్రపు కన్నయ్యమ్మ అనే వృద్ధురాలికి చెందిన పెంకుటిల్లు గోడతోపాటు కొంతమేర కప్పు కూలిపోయింది. గోడ కూలడం గమనించి బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. 

మాడుగుల మండలంలో పెద్దేరు, తాచేరు, గొర్రిగెడ్డ, ఉరకగెడ్డలతోపాటు చిన్న గెడ్డలు ఉధృతంగా పారుతున్నాయి. పెద్దేరు జలాశయం నుంచి నీటిని విడిచిపెట్టడంతో వాడపాడు, జంపెన గ్రామాల మధ్య వంతెన వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. 

కోటవురట్ల మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు  దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. వరహా, సర్పా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లింగాపురం, నీలిగుంట, సన్యాసిరాజుపాలెం, కె.వెంకటాపురం గ్రామాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. 


మాకవరపాలెంలో అధిక వర్షపాతం 

నర్సీపట్నం, అక్టోబరు 7: నర్సీపట్నం డివిజనల్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో చెరువులు, రిజర్వాయర్లు నిండాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు మాకవరపాలెం మండలంలో అత్యధికంగా 52.4 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. రోలుగుంటలో 44.2 మి.మీ.లు, నాతవరంలో 31.4, గొలుగొండలో 20.8, నర్సీపట్నంలో 18.6, మాడుగులలో 41.4, చీడికాడలో 42.4, కోటవురట్లలో 25,8, పాయకరావుపేటలో 30.4, ఎస్‌.రాయవరంలో 9.4, నక్కపల్లి మండలంలో 7.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. 


మళ్లీ మునిగిన స్వయంభూ విఘ్నేశ్వరుడు

చోడవరంలో శుక్రవారం భారీ వర్షం పడడంతో స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో జలమయం అయ్యింది. దీంతో గర్భగుడిలోకి నీరు చేరడంతో  స్వయంభూ విఘ్నేశ్వరుడి విగ్రహం మూడొంతులు నీట మునిగింది. అర్చకులు చలపతి, ఆలయ సిబ్బంది కలిసి నీటిని తోడుతున్నా మరోవైపు నీరు ఊరుతూనే ఉన్నది. గత ఆదివారం రాత్రి కూడా భారీ వర్షం పడడంతో విఘ్నేశ్వరుడి విగ్రహం నీట మునిగింది.

-చోడవరం


Read more