కాశీ అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకం: స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2022-03-17T02:08:10+05:30 IST

కాశీ క్షేత్రంతో తెలుగువారికి గొప్ప అనుబంధం ఉందని, కాశీ అభివృద్ధిలో తెలుగువారెందరో ఎంతో కీలకపాత్ర పోషించారని ..

కాశీ అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకం: స్వరూపానందేంద్ర

వారణాసి: కాశీ క్షేత్రంతో తెలుగువారికి గొప్ప అనుబంధం ఉందని, కాశీ అభివృద్ధిలో తెలుగువారెందరో ఎంతో కీలకపాత్ర పోషించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం స్వరూపానందేంద్ర కాశీ యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఆయన తన పరివారంతో కలిసి పంచగంగా స్నానమాచరించారు. కాశీ మహాక్షేత్రంలో గంగానదీ తీరాన 64 ఘాట్లు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనవి అస్సి, కేదార్, దశాశ్వమేధ, పంచగంగ, మణికర్ణిక ఘాట్లు. వీటిలో పుణ్నస్నానం ఆచరిస్తే భక్తి, జ్ఞాన, వైరాగ్యములు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. ఈ ఐదు ఘాట్లను సందర్శించిన స్వరూపానందేంద్ర అక్కడ పుణ్య స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి పూజలు చేసి హారతులిచ్చారు. విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున చీరను సమర్పించారు. అలాగే దండ తర్పణం చేశారు. ఈ సందర్భంగా అనేకమంది తెలుగువారు స్వరూపానందేంద్ర స్వామితో కలిసి మణికర్ణికలో మాధ్యాహ్నిక స్నానం చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచగంగా స్నానం సాగింది. పండితులు పవమాన సూక్తం, అఘమర్షణ సూక్తాలను పఠించారు. అనంతరం స్వరూపానందేంద్ర కాశీ ప్రాంతానికి క్షేత్రపాలిక దేవతగా విరాజిల్లుతున్న వారాహి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. స్వరూపానంద వెంట వారణాసి ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఉన్నారు.

Read more