-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » swaroopanandendra saraswati Vishaka Sri Sarada Peetham Visakhapatnam nrao-MRGS-AndhraPradesh
-
Swaroopanandendra: మూలమూర్తుల సంరక్షణకు సూచనలు
ABN , First Publish Date - 2022-10-12T01:26:33+05:30 IST
వైజాగ్: పంచారామాది ఆలయాల్లో పురాతన వైభవం దెబ్బ తినకుండా చేపట్టాల్సిన చర్యలపై విశాఖ శ్రీ శారదాపీఠం విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించింది.

వైజాగ్: పంచారామాది ఆలయాల్లో పురాతన వైభవం దెబ్బ తినకుండా చేపట్టాల్సిన చర్యలపై విశాఖ శ్రీ శారదాపీఠం విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించింది. పీఠం ప్రాంగణంలో పంచారామ, శైవ క్షేత్రాల పండితులతో అవగాహన సదస్సును చేపట్టింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో సాగిన ఈ సదస్సుకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హరి జవహర్‌లాల్, పలువురు డిప్యూటీ కమిషనర్లు, ఈఓలు, పండితులు, అర్చకులు హారజరయ్యారు. పంచారామ క్షేత్రాల నుంచి వచ్చిన ఆలయ వర్గాలు ఆయా క్షేత్రాల్లో జరుగుతున్న పూజా విధానాలు, అభిషేకాదుల గురించి వివరించారు.
అభిషేకాల వల్ల మూల మూర్తుల విగ్రహాలు విచ్ఛిన్నమవుతున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేసారు. ముందు జాగ్రత్తగా ఆయా ఆలయాల్లో చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి పలు ప్రతిపాదనలు చేసారు. పురాతన వైభవాన్ని చాటి చెప్పే మహిమాన్వితమైన మూల మూర్తులు విచ్ఛిన్నమైతే రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. అర్చక కుటుంబాలకిది మంచిది కాదని, మూల మూర్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పంచారామాల్లో ఉండే శివలింగాలు శుద్ధ శిలతో కూడినవని తెలిపారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి తొలి అర్చన కోసం క్షీరాన్ని వినియోగించవచ్చని సూచించారు. అనంతరం మూల మూర్తులపై రజిత లేదా బంగారు తొడుగులను పెట్టి కేవలం శుద్ధ జలాలతోనే అభిషేకాలను కొనసాగించాలని తెలిపారు. అభిషేకం మరింత ఫలవంతంగా ఉండేందుకు పచ్చ కర్పూర జలాలను వినియోగించవచ్చని సూచించారు.
ఆలయంలో నూనె దీపాలకు బదులు నేతి దీపాలను వెలిగించాలని, గర్భాలయంలోకి పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులను అనుమతించవద్దని స్వరూపానందేంద్ర సూచించారు. శివరాత్రి పర్వదినాన పూర్తిగా కవచములన్నింటినీ తొలగించి అభిషేకాలు కొనసాగించడం మంచిదన్నారు. ముఖ్యంగా కొబ్బరి నీరు మూల మూర్తులపై పడకుండా చూడాలని, అందులో ఉండే యాసిడ్స్ వల్ల విగ్రహాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. పంచారామ క్షేత్రాలల్లో పరమేశ్వరుని స్వరూపాన్ని భావి తరాలకు అందించాలంటే కొంత ఇబ్బందైనా ఈ చర్యను అనుసరించక తప్పదన్నారు. అభిషేకాలను సమయానుగుణంగా మాత్రమే చేయాలని, రాజకీయ, అధికార ఒత్తిళ్ళకు తలొగ్గి ఎపుడు పడితే అపుడు చేయవద్దని కోరారు. ఈ విషయంలో ఇబ్బందులెదురైతే అర్చకులకు విశాఖ శ్రీ శారదాపీఠం అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. అద్భుతమైన ఆరాధనా క్రమానికి ఈ నిర్ణయాలు ఇబ్బందిగా మారినా ఈ జాగ్రత్తలు పాటించడమే సరైనదన్నారు. ధర్మ పరిరక్షణ అనేది హిందువుల జీవన విధానంతో ముడిపడి ఉన్నందున పురాతన శివలింగాలను కాపాడుకోవాలని స్వరూపానందేంద్ర పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు అర్చక అకాడమీ డైరెక్టర్ వేదాంతం చక్రవర్తి కూడా పాల్గొన్నారు.