నిండా ముంచేసిన ‘ఏటికొప్పాక’

ABN , First Publish Date - 2022-02-23T05:33:01+05:30 IST

ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం, ఈ ఏడాది క్రషింగ్‌ చేపట్టకపోవడంతో మండలంలోని చెరకు రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

నిండా ముంచేసిన ‘ఏటికొప్పాక’
కొత్తమల్లంపేట కాటా వద్ద లారీలోకి చెరకు లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

గత సీజన్‌ చెరకు డబ్బులు ఇంతవరకు చెల్లించని షుగర్స్‌ యాజమాన్యం

ఈ ఏడాది క్రషింగ్‌కు చేతులెత్తేసిన వైనం

దిక్కుతోచని స్థితిలో చెరకు రైతులు

టన్ను రూ.2 వేలకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి


గొలుగొండ, ఫిబ్రవరి 22:

ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం, ఈ ఏడాది క్రషింగ్‌ చేపట్టకపోవడంతో మండలంలోని చెరకు రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఫ్యాక్టరీ పీకల్లోతు అప్పుల్లో వుండడంతో క్రషింగ్‌ జరిపే పరిస్థితి లేదని తెలుసుకున్న రైతులు... పొలాల్లో వున్న చెరకును ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి చెరకు తరలించవచ్చని ఏటికొప్పాక అధికారులు చెబుతున్నారని, కానీ ఇంతవరకు చెరకు తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని చెబుతున్నారు. చెరకు ఇప్పటికే పక్వానికి రావడం, ఎండలు ముదురుతుం డడంతో తోటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి  చెందిన బెల్లం తయారీదారులు ఇక్కడకు వచ్చి టన్ను రూ.2 వేల చొప్పున చెరకు కొనుగోలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది చెరకు మద్దతు ధర టన్ను రూ.2,750. కానీ ఏటికొప్పాక ఫ్యాక్టరీలో క్రషింగ్‌ జరపకపోవడం, మరోవైపు పొలాల్లో చెరకు ఎండిపోతుండడంతో నష్టానికి అమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-02-23T05:33:01+05:30 IST