వీఎంఆర్‌డీఏలో వింత పోకడలు

ABN , First Publish Date - 2022-11-25T00:58:36+05:30 IST

ఏ ప్రభుత్వ విభాగంలోకైనా ఇతర శాఖల నుంచి అధికారులు డిప్యుటేషన్‌పై రావడం సహజం. ఏడాదికో, రెండేళ్లకో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని, ఆ కాలపరిమితి ముగియగానే మాతృ శాఖకు వెళ్లిపోతుంటారు. అదే సీట్లో కొనసాగాలంటే..ప్రభుత్వం నుంచి మళ్లీ ఆర్డర్‌ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులు లేకుండా ఉంటే...వారిని సదరు శాఖ ఉన్నతాధికారులు వెనక్కి పంపించేయాలి. అది వారి బాధ్యత. లేదంటే అనధికారికంగా కొనసాగుతున్నట్టే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టే లెక్క. సదరు ఉద్యోగిపైన, కొనసాగించిన సంస్థ ఉన్నతాధికారిపైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

వీఎంఆర్‌డీఏలో వింత పోకడలు

ఆర్డర్లు లేకుండానే అధికారుల కొనసాగింపు

ఏడాదిగా సీఏఓ పోస్టులో నిర్మల

నెల రోజులుగా జాయింట్‌ కమిషనర్‌ సీట్లో రవీంద్ర

సీఈ పోస్టు మంజారు కాకుండానే అధికారి నియామకం

జీఓ లేకుండానే రిటైర్డ్‌ ఉద్యోగుల కొనసాగింపు

కలెక్టర్‌ పాలనలోనే నిబంధనల అతిక్రమణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఏ ప్రభుత్వ విభాగంలోకైనా ఇతర శాఖల నుంచి అధికారులు డిప్యుటేషన్‌పై రావడం సహజం. ఏడాదికో, రెండేళ్లకో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని, ఆ కాలపరిమితి ముగియగానే మాతృ శాఖకు వెళ్లిపోతుంటారు. అదే సీట్లో కొనసాగాలంటే..ప్రభుత్వం నుంచి మళ్లీ ఆర్డర్‌ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులు లేకుండా ఉంటే...వారిని సదరు శాఖ ఉన్నతాధికారులు వెనక్కి పంపించేయాలి. అది వారి బాధ్యత. లేదంటే అనధికారికంగా కొనసాగుతున్నట్టే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టే లెక్క. సదరు ఉద్యోగిపైన, కొనసాగించిన సంస్థ ఉన్నతాధికారిపైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

జిల్లా కలెక్టరే ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యత వహిస్తున్న విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి (వీఎంఆర్‌డీఏ) సంస్థలో ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి. కీలకమైన పోస్టుల్లోనే అనధికారికంగా ఎలా కొనసాగిస్తున్నారనేది అర్థం కావడం లేదు. వీఎంఆర్‌డీఏకి చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (సీఏఓ)గా నిర్మల 2020 డిసెంబరులో బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆడిట్‌ విభాగం నుంచి డిప్యుటేషన్‌పై ఏడాది కాలానికి మాత్రమే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ గడువు గత ఏడాది (2021) నవంబరుతో ముగిసిపోయింది. దానికి నెల రోజులు ముందు (2021 అక్టోబరు 8) ఆమె తనను కొనసాగించాలని కోరుతూ లేఖ పెట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె నవంబరు తరువాత వెళ్లిపోవాలి. కానీ అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరో ఏడాది కూడా గడిచిపోయింది. ఇప్పుడైనా ఆమె కొనసాగింపు ఆదేశాలు తెచ్చుకోవాలి. అవీ రాలేదు. అయితే గత రెండు వారాలుగా ఆఫీసుకు రావడం లేదు. సెలవులో కొనసాగుతున్నారు. అటు చూస్తే వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో లేఅవుట్ల పనులు జరుగుతున్నాయి. ఏడాదికి రూ.100 కోట్ల వరకు బిల్లులు చెల్లిస్తున్నారు. అకౌంట్స్‌ విభాగానికి కాంట్రాక్టర్లు బిల్లులో కొంత శాతం కమీషన్‌గా ఇవ్వడం రివాజుగా వస్తోంది. ఈ లెక్కన ఆ విభాగానికి భారీగా నజరానాలు అందుతున్నాయి. సీఏఓ కొనసాగింపుపై గత ఏడాది ఇదే సమయంలో అధికారుల వాట్సాప్‌ గ్రూపుల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్టుగా, అది తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

గడువు ముగిసినా జీతానికి సిఫారసులు

వీఎంఆర్‌డీఏకు గత ఏడాది అక్టోబరులో పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ నుంచి డిప్యుటేషన్‌పై రవీంద్ర అనే అధికారి జాయింట్‌ కమిషనర్‌గా వచ్చారు. ఆయనకు పదవీ కాలం ఈ ఏడాది అక్టోబరుతో ముగిసిపోయింది. ఇది నవంబరు నెల. ఆయన అమరావతి వెళ్లి కొనసాగింపు ఆదేశాలు కోసం యత్నించారు. కుదరదని అక్కడి అధికారులు తేల్చేశారు. ఆ మేరకు ఆయన్ను వెనక్కి పంపాలి. అసలు వీఎంఆర్‌డీఏలో జాయింట్‌ కమిషనర్‌ అనే పోస్టే లేదు. అందువల్ల ఆయన్ను అనధికారికంగా కొనసాగించడానికి వీల్లేదు. ఇప్పుడు నవంబరు నెల జీతం కూడా ఆయనకు ఇవ్వడానికి పే స్లిప్‌ తయారు చేస్తున్నారు. ఆర్డర్‌ లేకుండా ఎన్నాళ్లు ఆయన్ను కొనసాగిస్తారో చూడాలి.

సీఈ పోస్టు లేకుండానే నియామకం

వీఎంఆర్‌డీఏకి చీఫ్‌ ఇంజనీర్‌ పోస్టు లేదు. జగనన్న లేఅవుట్ల పనులు ఎక్కువగా ఉన్నందున వాటిని చూడడానికి ఓ సీఈ వుంటే బాగుంటుందని ఇటీవల వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో ప్రతిపాదించారు. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. కానీ లేని పోస్టులో సీఓగా శివప్రసాదరాజును నియమిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీచేశారు. పోస్టు శాంక్షన్‌ కాకుండా ఆయన్ను చేర్చుకోవడానికి వీల్లేదు. కానీ ఆయన సోమవారం వచ్చి విధుల్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఉత్తర్వులు లేకుండాన తొమ్మిది నెలల డ్యూటీ

ప్రభుత్వం కొద్దికాలం క్రితం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే అది అన్ని సంస్థలకు వర్తించదని, కొందరికేనని ఉత్తర్వులు వచ్చాయి. వీఎంఆర్‌డీఏకు కూడా ఆ నిబంధన వర్తించదని ఆదేశాలు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ఇక్కడి అధికారులు సుమారు 11 మంది ఉద్యోగులకు (అటెండర్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేడర్‌ వరకు) 60 ఏళ్లు పూర్తయినా పదవీ విరమణ ఉత్తర్వులు ఇవ్వకుండా కొనసాగించారు. అనుమానం వుంటే వెంటనే లేఖ రాసి తగిన ఆదేశాలు తెప్పించుకోవాలి. అలా చేయకుండా తొమ్మిది నెలలు కాలాయాపన చేశారు. వారందరికీ ప్రతి నెలా యథాప్రకారం జీతాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇటీవల వారిని ఇంటికి పంపాలని, జీతాలు రికవరీ చేయాలని ఉత్తర్వులు రావడంతో అధికారులు కింద మీద పడుతున్నారు.

జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో వున్న సంస్థలో ఇలా అడ్డగోలు వ్యవహారాలు నడుస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఏడాదికి వేయి కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ పెట్టుకొని పనిచేస్తున్న సంస్థను ఇన్‌చార్జి అధికారితో నడపడం చూస్తుంటే...ఇక్కడి నిధులను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వమే ఈ ఏర్పాటు చేసిందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-11-25T00:58:37+05:30 IST