స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చతికిల

ABN , First Publish Date - 2022-10-05T05:49:19+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు గత ఏడాదితో పోలిస్తే బాగా దిగజారాయి. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా వున్న కేటగిరీలో నర్సీపట్నం మునిసిపాలిటీ గత ఏడాది 5వ ర్యాంకు సాధించగా, ఈ ఏడాది 18వ స్థానానికి పడిపోయింది. 50 వేల కన్నా తక్కువ జనాభా వున్న కేటగిరీలో ఎలమంచిలి మునిసిపాలిటీ ఈ ఏడాది 13వ ర్యాంకుకు పడిపోయింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చతికిల
నర్సీపట్నం శారదానగర్‌లో డ్రైనేజీ నిర్వహణకు అద్దం పడుతున్న దృశ్యం

  దిగజారిన నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పనితీరు

నర్సీపట్నానికి గత ఏడాది 5వ ర్యాంకు... ఈ ఏడాది 18వ ర్యాంకుతో సరి

సౌత్‌జోన్‌ స్థాయిలో కూడా ఇదే తీరు

ఎలమంచిలికి 13వ ర్యాంకు

గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల  

నర్సీపట్నం/ ఎలమంచిలి, అక్టోబరు 4: స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు గత ఏడాదితో పోలిస్తే బాగా దిగజారాయి. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా వున్న కేటగిరీలో నర్సీపట్నం మునిసిపాలిటీ గత ఏడాది 5వ ర్యాంకు సాధించగా, ఈ ఏడాది 18వ స్థానానికి పడిపోయింది. 50 వేల కన్నా తక్కువ జనాభా వున్న కేటగిరీలో ఎలమంచిలి మునిసిపాలిటీ ఈ ఏడాది 13వ ర్యాంకుకు పడిపోయింది. 

దేశంలో పరిశుభ్రతను పెంపొందించేందుకు నగరాలు, పట్టణాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌కు రూపకల్పన చేసింది. 2015 అక్టోబరు రెండున గాంధీ జయంతిని పురుస్కరించుకుని స్వచ్ఛసర్వేక్షణ్‌  పేరుతో ఈ పోటీని ప్రారంభించింది. పురపాలక సంఘాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతోపాటు పరిశుభ్రత పట్ల ప్రజలను చైతన్యపరచడం, బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయడం, మరుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగానికి అనుగుణంగా మార్చడం, ఇళ్లలో ఉత్పత్తయ్యే చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి (తడి, పొడి) శాస్త్రీయ విధానంలో పునర్వినియోగం చేయడం వంటి చర్యలను స్థానిక సంస్థలు అమలుచేయాలి. అలాగే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై స్వచ్ఛంద సంస్థలు, బ్రాండ్‌ అంబాసిడర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. పోటీలో పాల్గొనే నగరాలు, పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపిస్తుంది. ఆయా బృందాలు నిర్దేశిత పట్టణంలో వారం రోజులపాటు వుండి అన్ని ప్రాంతాలను పరిశీలిస్తారు. ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తారు. వీటిని క్రోడీకరించి కేంద్రానికి నివేదిక పంపుతారు. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో 50 వేల పైబడి, లక్ష లోపు జనాభా వున్న కేటగిరీలో నర్సీపట్నం మునిసిపాలిటీ మెరుగైన ర్యాంకు సాధించడంలో విఫలమైంది. కనీసం గత ఏడాది వచ్చిన ర్యాంకను కూడా నిలబెట్టుకోలేకపోయింది. రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు రాగా, సౌత్‌ జోన్‌ స్థాయిలో 87వ ర్యాంకు పొందింది. గత ఏడాది రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు, సౌత్‌ జోన్‌ స్థాయిలో 37వ ర్యాంకు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఏకంగా 13 ర్యాంకులు దిగజారడం పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది, పాలకవర్గం పనితీరుకు అద్దం పడుతున్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా 50 వేల లోపు జనాభా వున్న కేటగిరీలో ఎలమంచిలి మునిసిపాలిటీ రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు, సౌత్‌ జోన్‌ స్థాయిలో 147వ ర్యాంకు సాధించినట్టు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రస్థాయి ర్యాంకు తగ్గిపోయింది. అయితే ఈ ఏడాది పారిశుధ్యం, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, పరిసరాల పరిశురఽభత, తడి-పొడి చెత్త నిర్వహణ తదితర వాటిని మెరుగుపరిచి మొదటి ఐదు స్థానాల్లో నిలిచేలా కృషి చేస్తామని చైర్‌పర్సన్‌ రమాకుమారి, కమిషనర్‌ కృష్ణవేణి తెలిపారు. 


Read more