ఉరుములు, మెరుపులు... పిడుగులు

ABN , First Publish Date - 2022-06-07T06:59:10+05:30 IST

ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలకు సోమవారం తెల్లవారుజామున నగరవాసులు ఉలిక్కిపడి నిద్రలేచారు.

ఉరుములు, మెరుపులు... పిడుగులు

ఉదయాన్నే ఉలిక్కిపడిన నగరం

చిమ్మచీకట్లు...ఈదురుగాలులతో జోరున వర్షం

కూలిన చెట్లు, విద్యుత్‌కు అంతరాయం

పరదేశిపాలెంలో 63 మిల్లీమీటర్లు నమోదు


విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):


ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలకు సోమవారం తెల్లవారుజామున నగరవాసులు ఉలిక్కిపడి నిద్రలేచారు. అదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపటికి జోరున వర్షం మొదలైంది. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ రాత్రి మాదిరిగా చీకట్లు కమ్మేశాయి. అయితే కొద్దిరోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న నగర వాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తా వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీంతో నగరంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి దట్టంగా మేఘాలు ఆవరించాయి. తెల్లవారుజామున  పిడుగులు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. రైతుబజార్‌కు కూరగాయలు తీసుకువచ్చిన రైతులు, పక్క జిల్లాల్లో విధుల కోసం రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరిన వారు తడిసి ముద్దయ్యారు. భారీవర్షానికి నగరంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్ఞానాపురం బ్రిడ్జి కింద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మురుగుకాల్వలు పొంగడంతో చెత్త చెదారం రోడ్లపై చేరింది. కలెక్టరేట్‌లోని జిల్లా ఖజానా కార్యాలయం తడిసిపోయింది. పై కప్పు మరమ్మతులు చేయకపోవడంతో కంప్యూటర్లపై టార్పాలిన్లు కప్పి సిబ్బంది మరో గది నుంచి విధులు నిర్వహించారు.  

కాగా ఈదురుగాలులు వీయడంతో తెల్లవారుజామునే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. నేలకొరిగిన చెట్లను తొలగించిన తరువాత దశలవారీగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. సోమవారం పరదేశిపాలెంలో 63 మి.మీ., సీతమ్మధారలో 57, పెందుర్తిలో 54.71, గాజువాకలో 44.75, ములగాడలో 41.25, గోపాలపట్నంలో 41.5, పెదగంట్యాడలో 39.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. 


పిడుగుల నుంచి అప్రమత్తంగా ఉండండి..

రుతుపవనాలు వచ్చే ముందు పిడుగులు తీవ్రత ఎక్కువగా వుంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అందువల్ల మేఘాలు ఆవరించి వర్షం మొదలైనప్పుడు చెట్ల కింద నడవడం, ఉండడం చేయవద్దని హెచ్చరించారు. రోడ్లపై నడిచివెళ్లేవారు సమీపంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. 

Read more