స్పందన అర్జీలకు ఎండార్స్‌మెంటు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-10-08T06:22:03+05:30 IST

స్పందన కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలకు ఎండార్స్‌మెంటు సక్రమంగా వేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

స్పందన అర్జీలకు ఎండార్స్‌మెంటు తప్పనిసరి
స్పందనలో ఆర్జీదారుల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి

అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం 

అటవీ హక్కు పత్రాలు, రోడ్లు, తాగునీరు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం అధికంగా వినతులు 


పాడేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలకు ఎండార్స్‌మెంటు సక్రమంగా వేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, డీఆర్‌వో బి.దయానిధిలతో కలసి శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. అటవీ హక్కు పత్రాలు, రోడ్లు, తాగునీరు, భూమి సమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం ఎక్కువగా వినతులు వస్తున్నాయన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి అర్జీకి సంబంధించి ఎండార్స్‌మెంట్‌ ప్రకారం పరిష్కారం చూపింది  లేనిదీ సదరు అర్జీదారులను విధిగా తెలపాలన్నారు. 

కాగా స్పందన కార్యక్రమంలో గిరిజనుల నుంచి 32 వినతులను స్వీకరించారు. హుకుంపేట మండలం రాప పంచాయతీ ఈదులగరువు గ్రామస్థులు తమ ప్రాంతంలో గెడ్డపై మినీబ్రిడ్జి నిర్మించాలని కోరారు. అరకులోయ మండలం బొండాం పంచాయతీ సర్పంచ్‌ దురియా భాస్కరరావు, పలువురు గ్రామస్థులు తమ పంచాయతీకి 70 విద్యుత్‌ స్తంభాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన జనపరెడ్డి అప్పారావు.. తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని, రెవెన్యూ అధికారులు అన్యాయంగా ఇతరులకు పట్టా చేసేశారని, తన న్యాయం చేసి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ దొడ్డవరం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ కనిగిరి రాజు, బూదరాళ్ల గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్మించానని, దానికి బిల్లు మంజూరు చేయాలని  అర్జీ అందజేశారు. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ మల్లిపాడు గ్రామానికి చెందిన కాకర సోములమ్మ వితంతు పింఛన్‌ను, వంజరి పంచాయతీ చింతలపాడు గ్రామానికి చెందిన కె.సింహాచలం వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సుజాత, గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ కె.లావణ్యకుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Read more