కలెక్టరేట్‌లో కోలాహలం

ABN , First Publish Date - 2022-09-13T06:14:40+05:30 IST

ఇక్కడి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్‌ ప్రాంగణం కోలాహలంగా మారింది. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టితో పాటు జేసీ కల్పనాకుమారి, డీఆర్‌వో పి.వెంకటరమణలు స్వయంగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

కలెక్టరేట్‌లో కోలాహలం
సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

‘స్పందన’లో అర్జీల సమర్పణకు భారీగా తరలి రాక

194 మంది నుంచి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌ తదితరులు

అనకాపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 12 : ఇక్కడి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్‌ ప్రాంగణం కోలాహలంగా మారింది. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టితో పాటు జేసీ కల్పనాకుమారి, డీఆర్‌వో పి.వెంకటరమణలు స్వయంగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ స్పందనలోని అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమ సమస్యలను వివరించేందుకు రాగా, డీఆర్‌వో పి.వెంకటరమణ వారి వద్దకు వెళ్లి అర్జీలను స్వీకరించారు. స్పందన ముగిసే సమయానికి 194 అర్జీలు వచ్చాయి. 

నా పింఛన్‌ నాకు ఇప్పించండి ..దివ్యాంగుడి మొర

రావికమతం మండలం కొత్తకోటకు చెందిన దివ్యాంగుడు ఎల్లేటి మాణిక్యం తన పింఛన్‌ను తనకు ఇప్పించాలని స్పందనలో అధికారులను వేడుకున్నాడు.  గత కొన్నేళ్ల క్రితం వరకు పింఛన్‌ అందుకునేవాడినని, మూడేళ్ల క్రితం ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరానని చెప్పాడు. అప్పట్లో వరుసగా మూడు నెలలు పింఛన్‌ తీసుకోకపోవడంతో రద్దు చేశారన్నాడు. ఈ సమస్యపై మూడు పర్యాయాలు స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు.  

కల్లుగీత కార్మికులు ఆందోళన

కలెక్టరేట్‌ గేటు ముందు కల్లుగీత కార్మికులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అక్టోబరు ఒకటో తేదీకి ఉపాధి అవకాశాలు కల్పించే నూతన ఎక్సైజ్‌ పాలసీ విధానాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. కల్లుగీత కార్పొరేషన్‌కు రూ. ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల నిధులు కేటాయించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలని, నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలని కోరారు. కొబ్బరి ఉత్పత్తులను నెలకొల్పాలని, బెల్లం, చక్కెర, సిరప్‌, జామ్‌, చాక్లెట్లు పామ్‌వైన్‌ వంటి బయో ప్రొడక్షన్‌ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


Read more