క్షేత్ర పరిశీలన తరువాతే దరఖాస్తుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-02-20T05:15:31+05:30 IST

స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే పరిష్కరించాలని ఎంపీడీవో రమేశ్‌నాయుడు సూచించారు.

క్షేత్ర పరిశీలన తరువాతే దరఖాస్తుల పరిష్కారం
మాట్లాడుతున్న ఎంపీడీవో రమేశ్‌నాయుడు

 అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు

ఎంపీడీవో రమేశ్‌నాయుడు

సబ్బవరం, ఫిబ్రవరి 19: స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే పరిష్కరించాలని ఎంపీడీవో రమేశ్‌నాయుడు సూచించారు. స్పందన దరఖాస్తులపై ఆయన స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలపై కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించే బాధ్యత కార్యదర్శులదేనన్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సచివాలయాల్లో అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా హెచ్చరికలు ఉండవని, తొలగింపులేనని హెచ్చరించారు. అర్జీదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించి పంపించాలని, అదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరిపాక, రాయపురఅగ్రహారం, బాటజంగాలపాలెం, ఎల్లుప్పి తదితర గ్రామాల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అర్జీదారులకు తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవన్నారు. స్పందన దరఖాస్తులను సీఎం ర్యాండమ్‌గా పరిశీలిస్తారని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య పరిష్కారమైతే అర్జీదారుడికి ఫోన్‌ చేసి సమా చారం ఇవ్వాలన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ పరిపాలనాధికారి షేక్‌ బాబూరావు, ఈవోపీఆర్‌డీ మహేశ్‌, ఏపీఎం శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ ఏఈ రామలక్ష్మణ,  వెలుగు ఏపీవో బీవీ రమణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హిమబిందు, పలువురు కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


Read more