సోలార్‌ పవర్‌తో సాలిడ్‌ ప్రాఫిట్‌

ABN , First Publish Date - 2022-03-23T06:24:52+05:30 IST

ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ సూర్యకాంతిని ముడిసరుకుగా చేసుకుని సింహాచలం దేవస్థానం ‘సోలార్‌ పవర్‌తో సాలిడ్‌ ప్రోఫిట్స్‌’ను సమకూర్చుకుని, దేవదాయశాఖకు ఆదర్శంగా నిలుస్తోంది. దేవస్థానం అనువంశిక ధర్మకర్త, ధర్మకర్తల మండలి చైర్మన్‌ పూజపాటి అశోక్‌గజపతిరాజు ఆలోచనతో 2017లో నాటి కార్యనిర్వహణాధికారి కోడూరి రామచంద్రమోహన్‌ పర్యవేక్షణలో కృష్ణాపురంలో సోలార్‌ పవర్‌ సిస్టంను స్థాపించారు. నృసింహవనం చేరువగా సర్వే నంబరు 275లో సుమారు ఐదెకరాల విస్తీర్ణంగల స్థలంలో నెట్‌క్యాప్‌ సంస్థ సాంకేతిక సహకారంతో దీనిని రూ.5.75 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.

సోలార్‌ పవర్‌తో సాలిడ్‌ ప్రాఫిట్‌
సోలార్‌ పవర్‌ ప్యానల్స్‌.

సౌరవిద్యుత్‌తో అప్పన్న ఖజానాకు ఆదాయం

ఇప్పటివరకు 69.30 లక్షల యూనిట్ల ఉత్పత్తి 

మిగులు సొమ్ము రూ.79,77లక్షలు 


సింహాచలం, మార్చి 22: ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ సూర్యకాంతిని ముడిసరుకుగా చేసుకుని సింహాచలం దేవస్థానం ‘సోలార్‌ పవర్‌తో సాలిడ్‌ ప్రోఫిట్స్‌’ను సమకూర్చుకుని, దేవదాయశాఖకు ఆదర్శంగా నిలుస్తోంది. దేవస్థానం అనువంశిక ధర్మకర్త, ధర్మకర్తల మండలి చైర్మన్‌ పూజపాటి అశోక్‌గజపతిరాజు ఆలోచనతో 2017లో నాటి కార్యనిర్వహణాధికారి కోడూరి రామచంద్రమోహన్‌ పర్యవేక్షణలో కృష్ణాపురంలో సోలార్‌ పవర్‌ సిస్టంను స్థాపించారు. నృసింహవనం చేరువగా సర్వే నంబరు 275లో సుమారు ఐదెకరాల విస్తీర్ణంగల స్థలంలో నెట్‌క్యాప్‌ సంస్థ సాంకేతిక సహకారంతో దీనిని రూ.5.75 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించి సుమారు ఐదేళ్ల వ్యవధిలో 69.30 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టు దేవస్థానం విద్యుత్‌ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేవస్థానం పరిధిలో 24 రకాల సర్వీసుల ద్వారా 235 హెచ్‌టీ, ఎల్‌టీ కనెక్షన్లతో విద్యుత్‌ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. సోలార్‌ పవర్‌  ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తైన విద్యుత్‌ను నేరుగా గ్రిడ్‌కు పంపుతారు. ఇందుకు ప్రతిగా ప్రతినెలా దేవస్థానం వినియోగించిన విద్యుత్‌ యూనిట్లకు చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని తగ్గించి, మిగిలిన సొమ్మును దేవస్థానానికి చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. సోలార్‌పవర్‌ ప్లాంట్‌ నిర్వహణకు గాను ఏడాదికి రూ.8 లక్షలను ఈపీడీసీఎల్‌కు చెల్లించేందుకు దేవస్థానం అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం 2021 సెప్టెంబరు నెలాఖరు వరకు జరిగిన ఉత్పత్తి నుంచి దేవస్థానం చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని మినహాయించగా, రూ.79.77లక్షలు దేవస్థానానికి ఆదాయం లభించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో గత సెప్టెంబరు వరకు దేవస్థానం ఖాతాకు  ఈపీడీసీఎల్‌ రూ.65.47లక్షలు జమ చేయగా, మరో రూ.14.31లక్షలు  చెల్లించాల్సి ఉంది. అదే విధంగా దేవస్థానం ఇప్పటి వరకు  ట్రాన్స్‌కోకు నెలకు సరాసరిన చెల్లిస్తున్న రూ.7 లక్షల విద్యుత్‌ చార్జీలు కూడా ఆదా కావడం పట్ల దేవస్థానం అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ లాభదాయకంగా ఉండడంతో ఒక మెగావాట్‌ ఉత్పత్తి సామర్థ్యం గల మరొక యూనిట్‌ను కృష్ణాపురంలోని దేవస్థానానికి చెందిన నృసింహవనంలో ప్రస్తుత ప్లాంట్‌కు ఆనుకుని నెలకొల్పాలని, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై నెట్‌క్యాప్‌ నిపుణులు ఇటీవల సమగ్ర అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేశారు. ఈపీడీసీఎల్‌ అధికారులతో చర్చించి, ప్రాజెక్టు నిర్మాణంపై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు. 

  


Updated Date - 2022-03-23T06:24:52+05:30 IST