ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-24T06:21:13+05:30 IST

ఫార్మాసిటీలోని ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది.

ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో అగ్ని ప్రమాదం
పరిశ్రమ నుంచి దట్టంగా ఎగసిపడుతున్న మంటలు, పొగ

- ఎఫ్లూయంట్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి ఎగసి పడిన మంటలు

- భయంతో కార్మికులు పరుగులు

పరవాడ, ఏప్రిల్‌ 23: ఫార్మాసిటీలోని ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎఫ్లూయంట్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి మంటలు ఎగసిపడడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కంపెనీలోని మూడు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఎఫ్లూయంట్‌ స్టోరేజ్‌ ట్యాంకులు సీఎస్‌- ఈయూ 3, 4, 5 ఉన్నాయి. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా కంపెనీలోని వివిధ విభాగాల నుంచి వ్యర్థాలు( ఎఫ్లూయంట్‌) ఈ ట్యాంకుల్లోకి పైపులైన్లు ద్వారా చేరుకుంటాయి. ఈ ఎఫ్లూయంట్‌ను పక్కనున్న మరో ట్యాంకులో నింపుతారు. అక్కడ ఎఫ్లూయంట్‌ను శుద్ధి చేసి అనంతరం పైపులైన్‌ ద్వారా సీఈటీపీ ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ ప్రక్రియను దగ్గరుండి ఆపరేటర్‌ పర్యవేక్షిస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎస్‌- ఈయూ 5 ట్యాంకులో ఎఫ్లూయంట్‌ ఎక్కువ మోదాతులో పైపులైన్‌ ద్వారా వెళుతుండగా రసాయనాలు ఒత్తిడికి గురై మంటలు వ్యాపించాయి. ఒక్క సారిగా మంటలతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో కంపెనీలో అలారం మోగించారు. ప్రమాద సమయంలో ట్యాంకులో సుమారు 3 వేలు లీటర్ల ఎఫ్లూయంట్‌ ఉన్నట్టు కంపెనీ సేఫ్టీ విభాగం ప్రతినిధి వెల్లడించారు. కాగా ఒక్కసారిగా పెద్ద మంటలతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద విషయం తెలుసుకున్న రాంకీ, లారస్‌ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఫోమ్‌ సాయంతో మంటలను అదుపు చేశారు. అదృష్ణవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. మంటలు అదుపులోకి వచ్చేందుకు సుమారు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం జరిగిందని తెలిసి పరవాడ తహసీల్దార్‌ బీవీ రాణి, సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్లూయంట్‌ స్టోరేజ్‌ ట్యాంకులో రసాయనాలు ఒత్తిడికి గురికావడంతో ప్రమాదం జరిగినట్టు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే జడ్పీటీసీ మాజీ సభ్యుడు పైలా జగన్నాథరావు, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కన్నూరి వెంకటరమణ, సీటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ సంఘటన స్థలాన్ని సందర్శంచి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

Read more