నర్సీపట్నం, అనకాపల్లిలో స్కిల్‌ హబ్‌లు

ABN , First Publish Date - 2022-09-30T06:04:48+05:30 IST

జిల్లాలో నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనకాపల్లి మండలం రేబాకలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు స్కిల్‌ హబ్‌లు మంజూరు అయ్యాయి.

నర్సీపట్నం, అనకాపల్లిలో స్కిల్‌ హబ్‌లు
నర్సీపట్నంలో స్కిల్‌ హబ్‌కు కేటాయించిన భవనం ఇదే

నిరుద్యోగ యువత ఉపాధికి నైపుణ్య శిక్షణ

నర్సీపట్నంలో ప్రొడక్షన్‌ కెమిస్టు కోర్సు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు 

బీఎస్సీ కెమిస్ర్టీ పూర్తిచేసిన వారికి అవకాశం

ఒక్కో బ్యాచ్‌లో 30 మంది

శిక్షణ అనంతరం ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు

అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు

ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన యువతకు ప్రవేశం



నర్సీపట్నం, సెప్టెంబరు 29: జిల్లాలో నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనకాపల్లి  మండలం రేబాకలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు స్కిల్‌ హబ్‌లు మంజూరు అయ్యాయి. ప్రైవేటు పరిశ్రమలు, కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చదువుకున్న యువతకు ఈ హబ్‌లలో వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారు. నర్సీపట్నం కళాశాలలో ప్రొడక్షన్‌ కెమిస్ట్‌ కోర్సులో శిక్షణ వుంటుంది. ప్రతి బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. మొత్తం 434 గంటలు శిక్షణకుగాను తొలుత 128 గంటలు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. మిగిలిన 306 గంటలు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసుగల బీఎస్సీ కెమిస్ట్రీ చదవిన  విద్యార్థులు నైపుణ్య శిక్షణకు అర్హులు. శిక్షణ పూర్తయిన తర్వాత ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కొప్పాకలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. అనంతరం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.


కొద్ది రోజుల్లోనే శిక్షణ ప్రారంభం

కె.శ్రీనివాస్‌, సమన్వయకర్త, స్కిల్‌ హబ్‌, నర్సీపట్నం

స్కిల్‌ హబ్‌కు భవనం సిద్ధంగా వుంది. ట్రైనర్‌ను కూడా నియమించారు. కుర్చీలు, బెంచీలు, టేబుళ్లు రెండు మూడు రోజుల్లో వస్తాయి. అనంతరం శిక్షణ ప్రారంభం అవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శిక్షణకు వచ్చే వారికి ఆర్టీసీ బస్సు పాస్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని. త్వరలో ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నియోజవర్గాల్లో కూడా స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు అవుతాయి.


Updated Date - 2022-09-30T06:04:48+05:30 IST