శారదానగర్‌లో విషాదఛాయలు

ABN , First Publish Date - 2022-11-24T00:51:06+05:30 IST

అనకాపల్లి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎర్రంశెట్టి అప్పారావు (51) మృతితో కొత్తూరు పంచాయతీ శారదానగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

శారదానగర్‌లో విషాదఛాయలు
ఎర్రంశెట్టి అప్పారావు (ఫైల్‌ ఫొటో)

నరసన్నపేటలో సీఎం జగన్‌ సభ బందోబస్తుకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందిన హెచ్‌సీ అప్పారావు

సొంతూరుకు భౌతికకాయం

ఎస్పీ గౌతమి శాలి, పలువురు పోలీసు అధికారుల నివాళి

కొత్తూరు (అనకాపల్లి), నవంబరు 23: అనకాపల్లి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎర్రంశెట్టి అప్పారావు (51) మృతితో కొత్తూరు పంచాయతీ శారదానగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు బందోబస్తు విధులకు వెళ్లిన ఆయన గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. అప్పారావు భౌతికకాయాన్ని బుధవారం రాత్రి శారదానగర్‌లోని నివాసానికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలి, దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ మళ్ల మహేష్‌, ట్రాఫిక్‌ సీఐ శేషు, తదితరులు ఇక్కడకు వచ్చి అప్పారావు పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా అప్పారావు సొంతూరు కశింకోట మండలం కన్నూరుపాలెం. 1990లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. ఈయనకు భార్య మల్లీశ్వరి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - 2022-11-24T00:51:06+05:30 IST

Read more