‘సీమ’ప్రాజెక్టులు సర్వనాశనం

ABN , First Publish Date - 2022-11-24T04:17:50+05:30 IST

రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులివ్వకుండా జగన్‌ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ప్రతిపక్షాలు అనడం కాదు..

‘సీమ’ప్రాజెక్టులు సర్వనాశనం

ఐఏబీ భేటీలో వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

ఈఈ, డీఈఈ, ఏఈఈలు హైదరాబాద్‌, బెంగళూరుల్లో మకాం

పర్యవేక్షణ చేసేవారే లేరు

కాలువలు, డిస్ట్రిబ్యూటరీల గేట్లు తుప్పుపడుతున్నా పట్టించుకోరేం?

సిబ్బంది జీతాలకైనా 5 లక్షలివ్వలేరా?

కర్నూలు, కడప ప్రజాప్రతినిధుల ఆగ్రహం

కర్నూలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులివ్వకుండా జగన్‌ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ప్రతిపక్షాలు అనడం కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యేలే విరుచుకుపడ్డారు. అది కూడా ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రబీకి సాగు నీటి విడుదలపై ఈ నెల 17వ తేదీన నంద్యాలలో ఆ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మంజీర్‌ జిలానీ సామూన్‌ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జడ్పీ చైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రాజెక్టుల ముఖ్య ఇంజనీర్లు పాల్గొన్నారు. అక్కడ చేసిన తీర్మానాలు, ప్రజాప్రతినిధులు మాట్లాడిన అంశాలు, అధికారుల సమాధానాలతో కూడిన నివేదిక బుధవారం బయటకు వచ్చింది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడి గురురాఘవేంద్ర ప్రాజెక్టు. 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వం వచ్చాక నిర్వహణ నిధులు ఒక్క పైసా ఇవ్వలేదు. విద్యుత్‌ సరఫరా, పంపు సెట్ల మరమ్మతు మొదలైన సమస్యలు దీనిని వేధిస్తున్నాయి. రూ.15 కోట్లు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు.

ఈఈ, డీఈఈ, ఏఈఈలు హైదరాబాద్‌, బెంగళూరుల్లో ఉంటూ సరైన పర్యవేక్షణ చేయకుండా ప్రాజెక్టును సర్వనాశనం చేశారన్న విమర్శలు ఉన్నాయి. గురు రాఘవేంద్ర డివిజన్‌ను ఎత్తివేసి ఎల్లెల్సీ డివిజన్‌లో కలపండి.. ప్రభుత్వ ఖజానాకు ఖర్చయినా తగ్గుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. శ్రీశైలం నియోజకవర్గంలో 21 వేల ఎకరాలకు సాగునీరు అందించే సిద్ధాపురం ఎత్తిపోతల ప్రాజెక్టు సబ్‌ స్టేషన్‌ నిర్వహణ సిబ్బంది జీతాలకు రూ.5 లక్షలు ఇవ్వలేరా.. అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ‘గోరుకల్లు జలాశయంలో 12.44 టీఎంసీల నీటిని నింపేందుకు అవకాశం ఉంది.. బ్యాలెన్స్‌ పనులు, శాశ్వత గ్రౌటింగ్‌, రక్షణ పనులు చేపట్టాలని రెండేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వాపోయారు. గోరుకల్లు జలాశయం రాతి పరుపు, ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌, ఆన్‌టెక్‌ (ఓటీ) స్లూయిస్‌.. వంటి బ్యాలెన్స్‌ పనుల కోసం రూ.93 కోట్లతో పంపిన ప్రతిపాదన ఫైలు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉందని ఇంజనీర్లు తెలిపారు. కేసీ కాలువ, తెలుగుగంగ కాలువ, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌ఆర్‌బీసీ) ప్రధాన కాలువలు, డిస్ర్టిబ్యూటరీల గేట్లు తుప్పు పట్టినా పట్టించుకునేవారు లేరని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనినిబట్టి రాయలసీమ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సాగునీటి నిపుణులు అంటున్నారు.

Updated Date - 2022-11-24T04:17:51+05:30 IST