డ్రోన్‌ ప్రమాదంలో సర్పంచ్‌కు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-11-17T01:28:25+05:30 IST

అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ సర్పంచ్‌కు డ్రోన్‌ కెమెరా ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలివి.

డ్రోన్‌ ప్రమాదంలో సర్పంచ్‌కు తీవ్ర గాయాలు
గాయపడిన కొత్తూరు సర్పంచ్‌ లక్ష్మీప్రసన్న

కొత్తూరు, నవంబరు 16 : అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ సర్పంచ్‌కు డ్రోన్‌ కెమెరా ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలివి. కొత్తూరు గ్రామంలో మంగళవారం డ్రోన్‌ ద్వారా సమగ్ర భూ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. సర్పంచ్‌ లక్ష్మీప్రసన్న, వైసీపీ మండల కార్యదర్శి భీశెట్టి జగన్‌, పంచాయతీ కార్యదర్శి రమాకుమారి, ఉప సర్పంచ్‌ శ్రీను తదితరులు ఈ కార్యక్రమాన్ని అట్టహా సం గా ప్రారంభించారు. అనంతరం డ్రోన్‌ను పైకి విడిచిపెట్టే క్రమంలో అది సర్పంచ్‌ లక్ష్మీప్రసన్న వైపు దూసుకు వచ్చింది. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పద్ధెనిమిది కుట్లు పడ్డాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు.

ప్రమాదవశాత్తూ రైతు మృతి

రావికమతం, నవంబరు 16: మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు రొచ్చుపణుకులో ప్రమాదవశాత్తూ రోటావేటర్‌ ట్రాక్టర్‌లో చిక్కుకుని ఓ గిరిజన రైతు మృతి చెందాడు. మృతుని కుమారుడు సన్యాసి తెలిపిన వివరాల ప్రకారం.. రొచ్చుపణుకులో జీడి తోటలో పేరుకుపోయిన గడ్డి, తుప్పలను కట్టెల బాలరాజు(55) బుధవారం సాయంత్రం రోటావేటర్‌ ట్రాక్టర్‌ సహాయంతో తొలగిస్తు న్నారు. రోటావేటర్‌లో చిక్కుకున్న గడ్డిని బాలరాజు తొలగిస్తూ ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. అయితే గంపవానిపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ రామేలపు దేముడు గమనించక పోవడంతో రోటావేటర్‌లో చిక్కుకుని బాలరాజు మృతి చెందాడు. ఈ మేరకు మృతుని కుమారుడు కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రావికమతం, నవంబరు 16 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలాపల్లి గ్రామానికి చెందిన బొండా జోగేష్‌(48), మజ్జి నాగేశ్వరావు(40)రోలుగుంట మండలం గైరంపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తున్నారు. అయితే చీమలపాడు గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఆ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్టాఫ్‌ నర్సుపట్ల అసభ్యకర ప్రవర్తనపై ఫిర్యాదు

నాతవరం, నవంబరు 16: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రాత్రి విధి నిర్వహణలో వున్నప్పుడు సిహెచ్‌.అప్పారావు అనే వ్యక్తి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ స్టాఫ్‌ ఎం.దుర్గ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

నాలుగు లీటర్ల నాటు సారాతో వ్యక్తి అరెస్టు

కృష్ణాదేవిపేట, నవంబరు 16: గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన లోవరాజు నుంచి నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ తెలిపారు. కొత్తబంగారంపేట పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారు చేసి, కృష్ణాదేవిపేటలో విక్రయించేందుకు తెస్తుండగా పట్టుకున్నామని, నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారని చెప్పారు.

Updated Date - 2022-11-27T12:23:52+05:30 IST

Read more