వాట్సాప్‌లో సర్కారీ వింతలు

ABN , First Publish Date - 2022-11-25T03:37:35+05:30 IST

వైసీపీ సర్కారులో వింతలు, విడ్డూరాలకు కొదవే లేకుండా పోతోంది. విద్యా రంగంలోనూ, విద్యార్థుల పరీక్షల విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తోంది.

వాట్సాప్‌లో సర్కారీ వింతలు

పాఠశాల ప్రశ్నపత్రాల్లో ఖర్చు తగ్గించే ప్లాన్‌

దాని ద్వారానే హెచ్‌ఎంలకు ఫార్మేటివ్‌ 2, 4

బోర్డుపై రాయించి విద్యార్థులకు పరీక్షలు

ఫార్మేటివ్‌ 3, సమ్మేటివ్‌కు ముద్రణ పత్రాలే

పారదర్శకత పేరుతో ద్వంద్వ విధానం

వాట్సా్‌పను అధికారికం చేసిన పాఠశాల విద్యాశాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కారులో వింతలు, విడ్డూరాలకు కొదవే లేకుండా పోతోంది. విద్యా రంగంలోనూ, విద్యార్థుల పరీక్షల విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తోంది. పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షల నిర్వహణకు ప్రశ్నపత్రాలను వాట్సా్‌పలో పంపనుంది. వాటి ఆధారంగా పరీక్షలు నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం పారదర్శకత కోసమేనని విద్యా శాఖ చెబుతోంది. అయితే పరీక్షలన్నింటికీ ఇదే విధానం పాటించడం లేదు. కొన్నింటికి వాట్సా్‌పలో ప్రశ్నపత్రాలు, మరికొన్నింటికి ముద్రించిన వాటిని పంపనుంది. పారదర్శకత పేరుతో ఒక్కో పరీక్షకు ఒక్కో విధానం ఎందుకు పాటిస్తోందో అర్థం కానీ ప్రశ్న. ఈ విద్యా సంవత్సరంలో (1 నుంచి 10 తరగతులు) ఇకపై జరగబోయే ఐదు విడతల పరీక్షల్లో ఫార్మేటివ్‌ 2, 4 పరీక్షల ప్రశ్నపత్రాలు వాట్సా్‌పలో తీసుకోవాలని సూచించింది. మరో ఫార్మేటివ్‌ పరీక్ష 3కు మాత్రం ముద్రించిన ప్రశ్నపత్రాలే పంపిస్తామని తెలిపింది. అలాగే సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ రెండు పరీక్షలకు ముద్రించిన ప్రశ్నపత్రాలే ఉంటాయని తెలిపింది. గతేడాది ఒకట్రెండు పరీక్షలకు ఇలాంటి విధానాన్నే అవలంభించారు.

హెచ్‌ఎంలకు ప్రశ్నపత్రాలు

వాట్సా్‌పలో ప్రధానోపాధ్యాయులకు ప్రశ్నపత్రాలు పంపుతారు. హెచ్‌ఎంలు వాటిని ఉపాధ్యాయులకు పంపించి బోర్డుపై రాయిస్తారు. విద్యార్థులు సమాధాన పత్రంలో ప్రశ్నలు రాసుకుని, వాటికి జవాబులు రాయాలి. ప్రశ్నపత్రాలు ముద్రించకపోవడంతో ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థులు చేయాలి. దీనిపై ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నించగా పారదర్శకత కోసమని పాఠశాల విద్యా శాఖ నుంచి సమాధానాలు వినిపిస్తున్నాయి. పరీక్ష జరగబోయే ముందురోజు అర్ధరాత్రి లేదా ఉదయం హెచ్‌ఎంలకు ప్రశ్నపత్రాలు చేరతాయి. ఈ విధానంతో పారదర్శకత పెరుగుతుందనుకుంటే మిగిలిన పరీక్షల ప్రశ్నపత్రాలను కూడా ఇలాగే వాట్సా్‌పలో పంపాలి. కానీ అలా చేయడం లేదు. సమ్మేటివ్‌ పరీక్షలు వంద మార్కులకు జరుగుతాయి కాబట్టి వాటిని బోర్డుపై రాయడం సాధ్యం కాదు. దీంతో ప్రశ్నపత్రాలను ముద్రిస్తోంది. 20 మార్కులకు ఉండే ఒక ఫార్మేటివ్‌ పరీక్ష (3)కు ముద్రించిన ప్రశ్నపత్రాన్నే పంపనుంది. మరో రెండు పరీక్షల (2, 4)కు ప్రశ్నపత్రాలు ముద్రించకపోవడం వల్ల భారీగా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అందుకోసమే వాట్సా్‌పలో పంపే విధానాన్ని ఎంచుకుందనే ప్రచారం సాగుతోంది. సాధారణంగా ముద్రించిన ప్రశ్నపత్రాలను జిల్లా కామన్‌ పరీక్షల బోర్డుల ద్వారా పాఠశాలలకు పంపిస్తారు.

వాట్సాప్‌ అధికారికమా?

ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలన్నీ లిఖిత పూర్వకంగానే ఉంటాయు. మౌఖికంగా ఇచ్చే ఆదేశాలకు విలువ ఉండదు. అలాగే మొబైల్‌ ఫోన్లు, వాట్సా్‌పలు, ఇతర సామాజిక మాధ్యమాల వచ్చే వాటిని ప్రామాణికంగా తీసుకోరు. ప్రభుత్వం రూపొందించిన ఫేసియల్‌ అటెండెన్స్‌ యాప్‌ను వినియోగించాలంటేనే ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలో వాట్సా్‌పను ప్రశ్నపత్రాల కోసం అధికారికంగా ఉపయోగించడం ఎంతవరకు సమంజసమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌ విధానమే వినియోగించాలనుకుంటే పాఠశాలలకు అధికారికంగా ఉన్న ఈ-మెయిల్‌ వాడాలి. దాని ద్వారా ప్రశ్నపత్రాలకు భద్రత ఉండే అవకాశం ఉంటుంది. వాట్సా్‌పను అధికారికంగా పరిగణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

హెచ్‌ఎంలపైనే ముద్రణ భారం

ప్రశ్నలను బోర్డుపై రాసి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ చెబుతున్నా హెచ్‌ఎంలు వాట్సా్‌పలో వచ్చిన ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ తీయించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరు రకాల పరీక్షలను అన్ని తరగతులకు ప్రతిరోజూ బోర్డుపై రాయడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. తరగతిలో పిల్లలందరికీ సరిగా కనిపించకపోవడం మరో ఇబ్బందిగా మారింది. దీంతో ఉదయాన్నే జిరాక్సు తీయించి పరీక్షలు పెడుతున్నారు. అయితే ఈ జిరాక్స్‌ల భారం ప్రధానోపాధ్యాయులపై పడుతోంది. పాఠశాల విద్యాశాఖ ఇందుకోసం నగదు ఇవ్వదు. పాఠశాల నిర్వహణ ఖర్చుల నుంచి వినియోగించే అవకాశం ఉండదు. దీంతో హెచ్‌ఎంల జేబుల నుంచి నగదు చెల్లించాల్సి వస్తోంది. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలపై ఈ భారం మరింత పెరిగింది.

Updated Date - 2022-11-25T03:37:36+05:30 IST