కేకేఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇసుక నిర్వహణ

ABN , First Publish Date - 2022-09-19T07:16:22+05:30 IST

ఉత్తరాంఽధ్రలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను చేపట్టే బాధ్యతలను కేకేఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే సంస్థకు అప్పగించారు.

కేకేఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇసుక నిర్వహణ

ఉత్తరాంధ్రలో అమ్మకాలకు ఆ సంస్థకు అనుమతి 

నేటి నుంచి అగనంపూడి, భీమిలిలో విక్రయాలు 

దశల వారీగా మిగిలిన డిపోల్లో ప్రారంభం  


విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంఽధ్రలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను చేపట్టే బాధ్యతలను కేకేఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే సంస్థకు అప్పగించారు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఇసుక విక్రయాలను నిర్వహిస్తుండగా ఐదారు రోజుల కిందట బ్రాక్సెన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఆ సంస్థ ప్రాంతాల వారీగా వివిధ సంస్థలకు సబ్‌లీజుకు అప్పగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఇసుక తవ్వకాలు, అమ్మకాలను కేకేఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు అప్పగించింది. ఈ సంస్థ విశాఖ నగరానికి చెందిన వారిదేనని సమాచారం. 

 రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ నగరంలోనే ఇసుక వ్యాపారం జరుగుతోంది. జిల్లాలో రీచ్‌లు లేనందున గోదావరి, వంశధార నదుల నుంచి ఇసుకను తవ్వి, నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇందుకోసం విశాఖ నగరంలోని ముడసర్లోవ, అగనంపూడిలో పెద్ద డిపోలు నిర్వహిస్తున్నారు. భీమిలి, అచ్యుతాపురం, నక్కపల్లి, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లిలో ఏర్పాటు చేసిన డిపోల ద్వారా కూడా ద్వారా విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా కేకేఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు లీజు ఒప్పందం జరగడంతో గత వారం రోజులుగా మూతపడిన ఇసుక డిపోల్లో అమ్మకాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ముందుగా సోమవారం నుంచి భీమిలి, అగనంపూడిలో విక్రయాలు ప్రారంభించనుండగా, దశలవారీగా మిగిలిన డిపోల్లో అమ్మకాలు చేపడతామని కేకేఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రతినిధి గౌతమ్‌ తెలిపారు. 

Read more