గ్రామాల్లో ఇసుక వేలం పాటలు

ABN , First Publish Date - 2022-11-19T00:32:56+05:30 IST

గ్రామాల్లో ఇసుక అక్రమ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. గత నెలలో కురిసిన భారీవర్షాలకు శారదా, పెద్దేరు, బొడ్డేరు నదుల్లో ఇసుక మేటలు పెరగడంతో ఇసుక త్వకాలు, రవాణా ఊపందుకున్నాయి.

   గ్రామాల్లో ఇసుక వేలం పాటలు

అక్రమ వ్యాపారానికి తెరతీసిన నేతలు

గవరవరం పంచాయతీలో రూ.9 లక్షలకు ఖరారైన ఇసుక పాట?

ఇదేబాటలో మరికొన్ని పంచాయతీలు..

చోడవరం, నవంబరు 18: గ్రామాల్లో ఇసుక అక్రమ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. గత నెలలో కురిసిన భారీవర్షాలకు శారదా, పెద్దేరు, బొడ్డేరు నదుల్లో ఇసుక మేటలు పెరగడంతో ఇసుక త్వకాలు, రవాణా ఊపందుకున్నాయి. స్థానిక అవసరాలు, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం నదుల నుంచి టైరుబళ్లతో ఇసుక తీసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును అక్రమ వ్యాపారులు తమకు అనుకూంగా మార్చుకుంటున్నారు. మండలంలోని గవరవరం పంచాయతీలో శారదా నది నుంచి ఇసుక తవ్వి, అమ్ముకోవడానికి అధికార పార్టీ నాయకులు ఇటీవల వేలం నిర్వహించి రూ.9 లక్షలకు ఖరారు చేసినట్టు సమాచారం. నది నుంచి టైరుబళ్లతో ఇసుక తీసుకెళ్లే వారంతా పాటదారులకు నిర్ణీత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి టైరుబళ్లకే అవకాశం అని చెబుతున్నా, త్వరలో ట్రాక్టర్లు, లారీల్లో కూడా ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో నదుల పక్కన వున్న గ్రామాల్లో ఇసుక వేలం పాటలు నిర్వహించినప్పటికీ, ప్రభుత్వం ఇసుక అక్రమ వ్యాపారానికి బ్రేకులు వేసి, టైరుబళ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనితో ఇసుక వేలం పాటలు నిలిచిపోయాయి. గ్రామాల్లో టైరుబళ్ల యజమానులు నది నుంచి ఇసుక తీసుకుని అవసరం ఉన్నవారికి విక్రయించేవారు. అయితే ఉచిత ఇసుక మాటున టైరుబళ్ల యజమానులే ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద నిల్వ ఉంచి రాత్రివేళల్లో లారీల్లోకి లోడింగ్‌ చేయించి సొమ్ము చేసుకుంటుంటున్నారు. దీంతో స్థానిక అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి, ఇసుక తవ్వకాలు, రవాణాకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు.

చోడవరం మండలంలో ముద్దుర్తి, గజపతినగరం, గోవాడ తదితర ప్రాంతాల్లోని టైరుబళ్ల యజమానులు స్థానిక అవసరాల పేరుతో నదుల్లో ఇసుక తవ్వకాలు జరుపుతూ వ్యాపారం చేస్తున్నారు. పగటి పూట నదుల్లో నుంచి టైరుబళ్లతో ఇసుక తీసి స్టాకు పాయింట్లకు తరలిస్తున్నారు. వెంకన్నపాలెం, ముద్దుర్తి, అంభేరుపురం, గజపతినగరం, రాయపురాజుపేట, చౌడువాడ పరిసర ప్రాంతాల నుంచి రోజూ రాత్రి పూట లారీల్లో ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా సాగిపోతున్నది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నుంచి స్పందన లేకపోవడంతో ఇసుక వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. తాజాగా ఇసుక వేలం పాటలు ఒక పంచాయతీలో మొదలు కావడంతో, ఇదే తరహాలో మిగిలిన పంచాయతీల్లో కూడా ఇసుక పాటలు నిర్వహించేందుకు స్థానిక నేతలు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-11-19T00:32:56+05:30 IST

Read more