ప్రైవేటు చేతికి రుషికొండ బీచ్‌

ABN , First Publish Date - 2022-10-08T06:38:40+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికైనా పర్యటనకు వెళితేనే...ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లించేసి, దుకాణాలు మూయించేసే పరిస్థితి.

ప్రైవేటు చేతికి రుషికొండ బీచ్‌

నిర్వహణ పేరుతో అప్పగింతకు యత్నాలు

ఇకపై బీచ్‌లో అడుగుపెట్టాలంటే...ప్రవేశ రుసుము చెల్లించాల్సిందే

టెండర్లు పిలిచిన పర్యాటకాభివృద్ధి సంస్థ

రుషికొండపై నిర్మిస్తున్నది సీఎం క్యాంపు కార్యాలయమని ఎప్పటినుంచో ప్రచారం

ఆ ప్రాంతంలో రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికైనా పర్యటనకు వెళితేనే...ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లించేసి, దుకాణాలు మూయించేసే పరిస్థితి. మరి అదే ముఖ్యమంత్రి ఏకంగా విశాఖపట్నం వచ్చి రుషికొండలో కూర్చుని పరిపాలిస్తే ఎలా ఉంటుంది?...అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఇప్పటినుంచే చేస్తున్నట్టుగా ఉంది. రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అటువైపు ఎవరూ రాకుండా అధికార యంత్రాంగం ముందుగానే తగిన జాగ్రత్తలు చేపడుతోంది. 

విశాఖపట్నంలో రుషికొండ బీచ్‌ చాలా ఫేమస్‌. ఈ బీచ్‌ ప్రత్యేకతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు వెచ్చించి ‘బ్లూఫ్లాగ్‌’ గుర్తింపు తీసుకువచ్చింది. వారాంతాల్లో ఈ బీచ్‌ కిటకిటలాడిపోతుంది. ఇప్పటివరకు విశాఖపట్నంలో ఏ బీచ్‌కు వెళ్లాలన్నా ఎటువంటి టిక్కెట్‌ లేదు. ఉచితంగానే వెళ్లొచ్చు. రుషికొండ కూడా అంతే. కాకపోతే...ఈ బీచ్‌ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం వాహనాల నుంచి పార్కింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. మనుషుల ప్రవేశానికి ఎటువంటి ఫీజులు లేవు. ఇకపై రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే సామాన్యులు ఆలోచించుకునేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీగా టిక్కెట్లు పెడితే...అంత ఖర్చు ఎందుకని ఎవరూ రారని, దాంతో రద్దీ తగ్గిపోతుందని ఎత్తుగడ వేసింది. అందుకే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీచ్‌ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఏపీటీడీసీ ప్రకటన జారీచేసింది. బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, సెక్యూరిటీ ఉండాలని, సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని, బాత్‌రూమ్‌లు క్లీన్‌గా ఉంచాలని...ఇలా ఏవేవో చెబుతూ ఆ పనులన్నింటితో పాటు బీచ్‌ నిర్వహణ చూసుకోవాలంటూ టెండర్లను ఆహ్వానించింది. టిక్కెట్ల ద్వారా ఆదాయం సంపాదించి, అందులో ఖర్చులు చూసుకుంటూ కొంత ఆదాయం ఇవ్వాలనేది ఒప్పందం. దీనికి ఒక ఏడాది అనుభవం వుంటే చాలని, ఏడాదికి రూ.50 లక్షల టర్నోవర్‌ చాలనే నిబంధన పెట్టారు. మరో 15 రోజుల్లో టెండర్లు తెరిచి ఏజెన్సీని నిర్ణయిస్తారు. ఆ సంస్థ రంగంలో దిగగానే ఎంట్రీ ఫీజు పెడుతుంది. ఉచితానికి అలవాటుపడిన ప్రజలు ఫీజు అనేసరికి ఆ బీచ్‌కు కాకుండా పక్కనున్న సాగర్‌నగరో, ఆ ముందునున్న తొట్లకొండ బీచ్‌(మంగమారిపేట)కో వెళ్లిపోతారు. దాంతో రుషికొండలో రద్దీ తగ్గిపోతుంది. అదే ఏపీటీడీసీకి కావలసింది. రద్దీ తగ్గిన తరువాత ఆంక్షలు మొదలవుతాయి. సీఎం ఇక్కడకు రాకముందే భవన సముదాయంతో పాటు పరిసర ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చేయాలనేది వారి వ్యూహంగా అర్థమవుతోంది. అధికారుల ఆలోచన ఎలా ఉన్నా...బీచ్‌లోకి వెళ్లడానికి టిక్కెట్లు పెడితే ఎలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 

Read more