చెరువు కాదు... ఇది రోడ్డే!

ABN , First Publish Date - 2022-09-29T06:26:09+05:30 IST

రహదారులపై భారీ గోతులు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు.

చెరువు కాదు... ఇది రోడ్డే!
వర్షపునీరు నిలిచిపోయి చెరువును తలపిస్తున్న చోడవరం మెయిన్‌ రోడ్డు

అధ్వానంగా తయారైన చోడవరం ప్రధాన రహదారి

భారీ గోతులు.. వర్షంపడితే ఈత కొలనులే!

మోకాలి లోతు నీటిలో వాహనదారుల కష్టాలు


చోడవరం, సెప్టెంబరు 28: రహదారులపై భారీ గోతులు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు. పనులు చేయించాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా వుంది. ఆర్‌అండ్‌బీ పరిధిలోని బీఎన్‌ రోడ్డు, కేబీ రోడ్డు, వడ్డాది నుంచి పాడేరు వెళ్లే ప్రధాన రహదారితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని ఇతర రోడ్లు పెద్ద పెద్ద గోతులతో దారుణంగా తయారయ్యాయి. నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలోని గాంధీగ్రామం సమీపంలోని ఆర్‌సీఎం చర్చి ఎదుట మెయిన్‌ రోడ్డులో ఇటీవల వరకు చిన్న చిన్న గోతుల వుండేవి. వీటిని పూడ్చకపోవడంతో ఇటీవల వర్షాలకు మరింత పెద్దవి అయ్యాయి. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో గోతుల్లో నీరు నిలిచిపోయి రోడ్డు మొత్తం చెరువులా తయారైంది. దీంతో ద్విచక్రవాహనదారులు మోకాలి లోతు నీటిలోనే అవస్థలు పడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు రోడ్డుపై నీరు ఇరువైపులా వున్న దుకాణాల వరకు విస్తరిస్తున్నది. రోడ్డుని అభివృద్ధి చేస్తామని  ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ ఏడాది నుంచి తరచూ చెబుతున్నారు. కనీసం గోతులు అయినా కప్పండి అంటూ రెండు నెలల క్రితం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు. కానీ ఫలితం లేకపోయింది.  


రావికమతం మండలంలో...

రావికమతం, సెప్టెంబరు 28: మండల పరిధిలోని బీఎన్‌ రోడ్డులో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రహదారి విస్తరణ పనుల టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సుమారు ఏడాదిపాటు పనులు మొదలుపెట్టలేదు. ప్రభుత్వం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఎట్టకేలకు ఇటీవల ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో పనులు మొదలుపెట్టారు. రావికమతం- మేడివాడ గ్రామాల మధ్య ఏర్పడిన గోతులను తూతూ మంత్రంగా పూడ్చడంతో  కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మెటల్‌ లేచిపోయి, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ద్విచక్రవాహనదారులు  రాత్రి సమయంలో ఈ గోతుల వద్ద   ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గోతులు పూడ్చివేత పనులను పటిష్ఠంగా చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


Read more