ఇద్దరు వైద్యుల జీతాలు నిలుపుదల

ABN , First Publish Date - 2022-07-07T06:24:17+05:30 IST

పెదబయలు మండలం మారుమూల బొండపల్లిలోని ఆశ్రమ పాఠశాల, గ్రామ సచివాలయం, గోమంగి పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బుధవారం సందర్శిం చారు

ఇద్దరు వైద్యుల జీతాలు నిలుపుదల

- గోమంగి పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌

- ఆరు రోజులుగా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో డాక్టర్లు సంతకాలు పెట్టకపోవడంపై అసహనం

పాడేరు/పెదబయలు, జూలై 6(ఆంధ్రజ్యోతి): పెదబయలు మండలం  మారుమూల బొండపల్లిలోని ఆశ్రమ పాఠశాల, గ్రామ సచివాలయం, గోమంగి పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బుధవారం సందర్శిం చారు. గోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శనలో భాగంగా రికార్డులను పరిశీలించారు. ఆరు రోజులుగా వైద్యులు అంబరీశ్‌, నాగ నాగేంద్ర అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు వైద్యుల జీతం నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైద్యులు పని తీరు మెరుగుపరచుకోవాలని, ఆశ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. 

సచివాలయ సిబ్బంది పనితీరుపై ఆరా

గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది విధిగా గ్రామాలను సందర్శించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తొలుత బొండపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సిబ్బంది కార్యాలయానికే పరిమితం కాకుండా గ్రామాలను సందర్శించాలన్నారు. సమయపాలన పాటించాలని, అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, ఆధార్‌ కార్డులు, పింఛన్లు సక్రమంగా అందించాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లతో చర్చించాలన్నారు. అనంతరం బొండపల్లిలోని ఆశ్రమ పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, యూనిఫారం పంపిణీ చేయాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భోజన మెనూ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-07-07T06:24:17+05:30 IST