సింథియా రహదారిలో ఆంక్షలు

ABN , First Publish Date - 2022-02-20T05:12:15+05:30 IST

ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ(పీఎఫ్‌ఆర్‌), మిలాన్‌ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు సింథియా రహదారిలో ఆంక్షలు విధించారు.

సింథియా రహదారిలో ఆంక్షలు
సింథియా రహదారి

నేటి నుంచి 22వ తేదీ వరకు ఆయిల్‌ ట్యాంకర్ల నిలిపివేత

పీటీడీ బస్సుల సమయం కుదింపు

మల్కాపురం, ఫిబ్రవరి 19: ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ(పీఎఫ్‌ఆర్‌), మిలాన్‌ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు సింథియా రహదారిలో ఆంక్షలు విధించారు. 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు సింథియా నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌కు వెళ్లే మార్గం, అలాగే వీడీఆర్‌ గొడౌన్‌, మారుతీ జంక్షన్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ మార్గంలో వెళ్లే ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ఇప్పటికే చమురు కంపెనీలకు పోలీసులు లేఖలు కూడా పంపారు. ఆదివారం ఆయిల్‌ కంపెనీలకు సెలవు కనుక సోమవారం నుంచి యథావిధిగా చమురు ఉత్పత్తుల రవాణాను మొదలుపెడతాయి. అయితే నగరంలోని పెట్రోల్‌ బంక్‌లకు గానీ, ఇతర కంపెనీలకు గానీ సోమ, మంగళవారాల్లో చమురు సరఫరా ఉండదు. అందువల్ల చమురుకు ఇబ్బందులు ఉండకూడదని భావించిన పెట్రోల్‌ బంక్‌ల యజమానులు అదనపు చమురు లోడ్‌లను తీసుకుని భద్రపరుచుకున్నారు. సోమ, మంగళవారాలలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ చమురు కంపెనీల చమురు ఉత్పత్తులను గాజువాక వైపు ఉన్న పెట్రోల్‌ బంక్‌లకు, ఎన్‌ఏడీ, గోపాలపట్నం వైపు ఉన్న పెట్రోల్‌ బంక్‌లకు జింక్‌ గేటు నుంచి బీహెచ్‌పీవీ మీదుగా హైవేకి తీసుకొచ్చి అక్కడి నుంచి తరలిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులకు కూడా ఆంక్షలు విధించారు. శని, ఆదివారాలలో సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు, అలాగే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  పీటీడీ బస్సు సర్వీసులను నిలిపివేయాలని పోలీసులు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు వంటి వాటిని కేవలం ముఖ్యులు రాకపోకలు సాగించినప్పుడు మాత్రమే నిలిపివేస్తారు. మిగతా సమయాల్లో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. 

Read more