బీజేపీ ఫ్లెక్సీలు, జెండాల తొలగింపు

ABN , First Publish Date - 2022-11-12T02:38:34+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సిబ్బందితో నడిరోడ్డుపై వాదులాటకు దిగారు.

బీజేపీ ఫ్లెక్సీలు, జెండాల తొలగింపు

జీవీఎంసీ సిబ్బందిపై సోము వీర్రాజు ఆగ్రహం

విశాఖపట్నం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సిబ్బందితో నడిరోడ్డుపై వాదులాటకు దిగారు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ బీజేపీ కూడా పలుచోట్ల ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేసింది. అయితే శుక్రవారం సాయంత్రం వీర్రాజు సిరిపురం ద్రోణంరాజు సర్కిల్‌ వైపు వెళుతుండగా, అక్కడి బీజేపీ జెండాలను జీవీఎంసీ సిబ్బంది తీసేసి, వ్యానులో తీసుకువెళుతూ కనిపించారు. వెంటనే సోము వీర్రాజు తన వాహనం నుంచి దిగిపోయి... వారికి అడ్డం పడ్డారు. వ్యానులో నుంచి జెండాలు తీసి మళ్లీ పెట్టే ప్రయత్నం చేశారు.

‘ప్రధాని వస్తున్నారని జెండాలు పెడితే... రెండు రోజులు కూడా ఉంచరా?’ అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ ఆదేశం మేరకు తొలగించామని సిబ్బంది చెప్పగా, ఆయనతో నేను మాట్లాడతా, ఫోన్‌ ఇవ్వండి అంటూ వారిపైకి వెళ్లారు. బీజేపీ ఎంపీ ఒక రోజు ముందే కమిషనర్‌తో మాట్లాడి అనుమతి తీసుకున్నారని, ఇలా చేయడం తగదన్నారు. అయితే అధికారుల ఆదేశాలు పాటించడం తమ విధి అంటూ వారు జెండాలను తీసుకెళ్లిపోయారు. కాగా, ప్రధానితోపాటు సీఎం జగన్‌ కూడా శుక్రవారం విశాఖపట్నం వచ్చారు. సీఎం జగన్‌ సిరిపురం వైపు నుంచి పోర్టు గెస్ట్‌హౌ్‌సకు వెళతారు. ఆయనకు వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు కాకుండా బీజేపీవి కనిపిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు ముందు జాగ్రత్తగా ఆయా మార్గాల్లో మరో పార్టీ జెండాలు లేకుండా చేశారు.

Updated Date - 2022-11-12T02:38:34+05:30 IST