ఆరోగ్యవర్సిటీ పేరు మార్పుపై నేటి నుంచి రిలే దీక్షలు

ABN , First Publish Date - 2022-09-30T05:54:01+05:30 IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుతో ప్రభుత్వ నిరంకుశధోరణి బయటపడిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ విమర్శించారు.

ఆరోగ్యవర్సిటీ పేరు మార్పుపై నేటి నుంచి రిలే దీక్షలు
సమావేశంలో మాట్లాడుతున్న గండి బాబ్జీ

టీడీపీ విశాఖ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ

విశాఖపట్నం/మహారాణిపేట, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుతో ప్రభుత్వ నిరంకుశధోరణి బయటపడిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ విమర్శించారు. గురువారం  పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీ పేరు మార్పును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వీలుగా శుక్రవారం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోజులపాటు రిలేదీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. తొలి రోజు దీక్షలో 27, 29, 30 వార్డులకు చెందిన పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. ప్రతి రోజూ ఆయా వార్డుల నుంచి నాయకులు హాజరుకావాలని కోరారు. ఇటీవల వరకు నియోజకవర్గ పరిశీలకునిగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఉండేవారని, అతని స్థానంలో పాడేరు నియోజకవర్గానికి చెందిన ఎంవీఎస్‌ ప్రసాద్‌ను నియమించారని తెలిపి, నేతలు, కార్యకర్తలకు ప్రసాద్‌ను పరిచయం చేశారు. అనంతరం పరిశీలకుడు ప్రసాద్‌ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పునరంకింతం కావాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు గొలగాని వీరారావు, గోడే విజయలక్ష్మి, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T05:54:01+05:30 IST