రైల్వే జోన్‌కు రెడ్‌ సిగ్నల్‌!?

ABN , First Publish Date - 2022-09-28T06:47:13+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా వున్నట్టు కనిపించడం లేదు.

రైల్వే జోన్‌కు రెడ్‌ సిగ్నల్‌!?

వీలు కాదంటున్న రైల్వే బోర్డు

విభజన హామీల అమలుపై రెండు తెలుగు రాష్ర్టాల అధికారులతో ఢిల్లీలో సమావేశం

జోన్‌పై చర్య

సాధ్యం కాదన్న బోర్డు చైర్మన్‌

ఆ విషయాన్ని కేబినెట్‌కు వదిలిపెడదామన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి


విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా వున్నట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల ముందు ప్రకటన అయితే చేసింది గానీ...ఇప్పటివరకూ ఆ హామీని నెరవేర్చే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మూడున్నరేళ్లుగా ఏదో ఒక సాకు చూపుతూ వస్తోంది. 

విభజన హామీలపై రెండు తెలుగు రాషా్ట్రల ఉన్నతాధికారులతో మంగళవారం ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రైల్వే జోన్‌ గురించి ప్రస్తావన తీసుకురాగా...రైల్వే బోర్డు చైర్మన్‌ అది సాధ్యం కాదని విస్పష్టంగా చెప్పేశారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఇవ్వలేమని, ఫీజుబుల్‌ కాదని అన్నారు. ఈ సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా కల్పించుకొని...రైల్వే జోన్‌ నిర్ణయాన్ని కేబినెట్‌కు వదిలిపెడుతున్నామంటూ అక్కడి పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. 


ఆది నుంచే అదే వాదన

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ కోసం రెండు దశాబ్దాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర విభజన సమయంలో అప్పుడు కేంద్రంలో వున్న ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ తరువాత గత ఎన్నికల ముందు బీజేపీ కూడా విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామని ప్రకటించింది. కానీ దానిని ఇప్పటివరకు అమలు చేయలేదు. రాష్ట్రంలో 25 మంది ఎంపీలను తమ పార్టీకి చెందిన వారిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హామీలు గుప్పించారు. ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించినా వారు ఢిల్లీలో నోరెత్తి ఏమీ అడగలేకపోతున్నారు. అసలు ఈ ప్రాంత ఎంపీలను ఢిల్లీలో మాట్లడనివ్వకుండా ఆ పార్టీయే అడ్డుకుంటోంది. ప్రశ్నించాల్సిన ఎంపీలే నోరు మూసుకోవడంతో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు వంటివారు గట్టిగా నిలదీస్తే...డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ తెప్పించుకున్నామని, దానిని అధ్యయనం చేస్తున్నామని రెండేళ్లుగా చెబుతున్నారు. ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఓఎస్‌డీ కార్యాలయం ఒకటి ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారు. అంతకు మించి ఏమీ చేయలేదు. రైల్వే బోర్డు చైర్మనే కొత్త జోన్‌ ఇవ్వలేమని చెబుతుంటే...ఇక అది వస్తుందని నమ్మకం ఏమిటని విశాఖ ప్రాంత నాయకులు అనుమానం వ్యక్తంచేశారు. ఒకవేళ జోన్‌ గనుక రాకపోతే...రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీతో పాటు బీజేపీ వైఫల్యంగానే భావించాల్సి వుంటుందని విశాఖ వాసులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 


జోన్‌ ఇవ్వాల్సిందే...

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం వంచిస్తోంది. జోన్‌ ఇస్తామని గత ఎన్నికల ముందు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆ పార్టీయే అధికారంలో ఉన్నా జోన్‌ ఏర్పాటుకు ఇష్టపడకపోవడం అన్యాయం. రాష్ట్ర విభజన హామీలలో వున్న రైల్వే జోన్‌ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తజోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని అవాస్తవాలు చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు చేయాల్సిందే.


మళ్లీ ఉద్యమిస్తాం

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేవీ సత్యనారాయణమూర్తి

విశాఖ కేంద్రంగా జోన్‌ కావాలని రెండు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నాం. దశల వారీగా పోరాటం కొనసాగించాం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే జోన్‌ ఇచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ముందు నుంచీ లేదు. అన్ని అర్హతలున్నా విశాఖపట్నం కేంద్రంగా జోన్‌ ఏర్పాటుకు ఇష్టపడడం లేదు. అయినా విడిచిపెట్టేది లేదు. జోన్‌ ఏర్పాటుకు తిరిగి మళ్లీ ఉద్యమిస్తాం. ఆందోళనలు చేపడతాం.

Read more