కుమ్మేసిన వాన

ABN , First Publish Date - 2022-09-25T06:59:39+05:30 IST

మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసి, మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంటపాటు భారీగా వర్షం కురిసింది.

కుమ్మేసిన వాన
చోడవరం మండలం అడ్డూరు వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు

- రహదారులు జలమయం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగి ప్రవహించాయి. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. 

చోడవరం, సెప్టెంబరు 24: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసి, మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంటపాటు భారీగా వర్షం కురిసింది. మండలంలోని అడ్డూరు వద్ద జవ్విగడ్డ పొంగి ప్రధాన రహదారిపై ప్రవహించింది. దీంతో చోడవరం- విశాఖ రోడ్డులో వాహనాల రాకపోకలు సుమారు గంట పాటు నిలిచిపోయాయి.

కోటవురట్లలో...

కోటవురట్ల: మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలోని గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించడంతో చెరువుల్లోకి నీరు పుష్కలంగా చేరింది.   సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. 

దేవరాపల్లిలో..

దేవరాపల్లి: మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వాన కురిసింది. వర్షం వల్ల సరుగుడు, చెరకు, మెరక ప్రాంతాల్లో వరి పంటలకు ఉపయోగ మని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కె.కోటపాడులో..

కె.కోటపాడు: మండలంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వరి పంటకు మరింత అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగిలిన పంటలకు కూడా ఈ వర్షం అనుకూలమని రైతాంగం చెబుతున్నారు.  

మాడుగులలో..

మాడుగుల రూరల్‌: మండలంలో శనివారం మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్నం ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులుతో మోస్తరు వర్షం పడింది. 

బుచ్చెయ్యపేటలో..

బుచ్చెయ్యపేట: మండలంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి బంగారుమెట్ట, విజయరామరాజుపేట, బుచ్చెయ్యపేట, సీతయ్యపేట కూడలి నీటమునిగాయి. వరి, చెరకు పంటలకు ఈ వర్షం ఉపయోగకరమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more