మన్యంలో ముసురు

ABN , First Publish Date - 2022-10-08T06:14:55+05:30 IST

పశ్చిమ బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన్యంలో శుక్రవారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది.

మన్యంలో ముసురు
పాడేరులో ముసురు వాతావరణం

కొనసాగుతున్న వర్షాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు

మారుమూల గ్రామాలకు నిలిచిన రాకపోకలు

అనంతగిరిలో అత్యధికంగా 66.5 మి.మీ.ల వర్షపాతం


పాడేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన్యంలో శుక్రవారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాగులు, గెడ్డలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు శివారు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జనజీవనానికి తీవ్రఅంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లో శుక్రవారం వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల మీదుగా వరద నీరు ప్రవహిస్తున్నది. అయితే పంటలకు, ఆస్తులకు నష్టం వాటిల్లినట్టు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు. 

కొయ్యూరు మండలంలో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాలుగు రోజల నుంచి వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. చిట్టింపాడు పంచాయతీ గోపవరం గ్రామంలోకి సమీపంలోని కొండవాగు ప్రవాహం చొచ్చుకు రావడంతో గ్రామస్థులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వరద నీటి ప్రవాహంతో వీధులన్నీ కాలువలుగా మారాయి. యు.చీడిపాలెం, మఠం భీమవరం పంచాయతీల్లోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నిత్యావసర సరకులకు ఇబ్బంది పడుతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో రోజంతా దఫదఫాలుగా జల్లులు పడుతూనే వున్నాయి. ఫుట్‌పాత్‌ వ్యాపారాలు సాగలేదు. పర్యాటకులు తక్కువగానే వచ్చారు. వర్షం కారణంగా డుంబ్రిగుడ మండలం అరకు వారపు సంతకు వచ్చిన గిరిజనులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ముంచంగిపుట్టు మండలంలో శుక్రవారం కూడా ముసురు వాతావరణం నెలకొంది. రోజంతా జల్లులు పడుతూనే వున్నాయి. మత్స్యగెడ్డ పాయాల్లో వరద ప్రవాహం పెరగడంతో జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతున్నది.

అనంతగిరిలో అత్యధిక వర్షపాతం

అనంతగిరి మండలంలో అత్యధికంగా 66.5 మిల్లీమీటర్లు, ముంచంగిపుట్టు మండలంలో అత్యల్పంగా 1.7 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. కొయ్యూరులో 40.7 మిల్లీమీటర్లు, పాడేరులో 32.3, డుంబ్రిగుడలో 22.5, జి.మాడుగులలో 19.4, అరకులోయలో 16.5, హుకుంపేటలో 13.3, చింతపల్లిలో 15.3, జీకేవీధిలో 10.5, పెదబయలులో 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


చింతపల్లి, జీకేవీధిలో భారీ వర్షం

చింతపల్లి, అక్టోబరు 7: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు విడతలవారీగా కుండపోతగా వర్షం పడింది. రహదారులన్నీ వర్షపునీటితో వాగులను తలపించాయి. చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా పెదవలస వారపు సంతకు వచ్చిన గిరిజనులు, వ్యాపారులు తడిసిముద్దయ్యారు.






Updated Date - 2022-10-08T06:14:55+05:30 IST