పుణ్యం కాదు.. వ్యాధులు వస్తాయి!

ABN , First Publish Date - 2022-09-10T06:40:48+05:30 IST

ఉపమాక... ఆ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొస్తుంది వేంకటేశ్వరస్వామివారు స్వయంవ్యక్తమైన క్షేత్రమని. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు... ఆలయానికి సమీపంలో వున్న స్వామివారి పుష్కరిణి (బంధుర సరస్సు)లో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుంటారు.

పుణ్యం కాదు.. వ్యాధులు వస్తాయి!
నాచు, గడ్డి పెరిగిపోయిన స్వామివారి పుష్కరిణి

దుర్గంధభరితంగా ఉపమాక వెంకన్న పుష్కరిణి

పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

బలిసిపోయిన గడ్డి తుప్పలు

పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు వెనకడుగు

పుష్కరిణి నిర్వహణను గాలికొదిలేసిన టీటీడీ అధికారులు


నక్కపల్లి, సెప్టెంబరు 9: ఉపమాక... ఆ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొస్తుంది వేంకటేశ్వరస్వామివారు స్వయంవ్యక్తమైన క్షేత్రమని. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు... ఆలయానికి సమీపంలో వున్న స్వామివారి పుష్కరిణి (బంధుర సరస్సు)లో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కానీ ఇప్పుడు పుష్కరిణిలో స్నానం చేస్తే పుణ్యం మాట దేవుడెరుగు... కచ్చితంగా రోగాలు, ముఖ్యంగా చర్మవ్యాధులు వస్తాయనే చెప్పాలి. శతాబ్దాల చరిత్ర వున్న పుష్కరిణి నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) అధికారులు గాలికొదిలేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏడేళ్ల క్రితం వరకు దేవదాయ శాఖ పరిధిలో వున్న ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2015 నవంబర్‌ 18న టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది. తొలుత రెండు సంవత్సరాలపాటు టీటీడీ అధికారులు చేసిన హంగామా చూసిన భక్తులు, ఉపమాక ఆలయానికి మహర్దశ పట్టిందని భావించారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో అధికారులు హడావుడి చూసి, తిరుమల తరహాలో సమూల మార్పులు జరుగుతాయని ఊహించారు. ఇదంతా పాల పొంగేనని అవగతం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. నాలుగేళ్ల నుంచి టీటీడీ ఉన్నతాధికారులెవరూ ఈ ఆలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. పుష్కరిణి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. నాలుగేళ్ల నుంచి శుభ్రం చేయలేదు. నాచు, గడ్డి విపరీతంగా పెరిగిపోయాయి. పూడిక పేరుకుపోయింది. కాగితాలు, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో పుష్కరిణి కలుషితమై, తీవ్ర దుర్వాసన వస్తున్నది. నీరంతా రంగు మారిపోయింది. ఈ నీటిలో కాలు పెడితే చర్మవ్యాధులు సోకుతాయని భక్తులు భయపడే పరిస్థితి నెలకొంది. పుష్కరిణి దుస్థితి గురించి పలుమార్లు ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఎమ్మెల్యే బాబూరావు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదని వెంకన్న భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు (దసరా పండుగ సందర్భంగా) జరుగుతాయి. టీటీడీ  ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, స్వామివారి పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  


Read more