ప్రజా రవాణా లేదా సైకిల్‌ వినియోగం

ABN , First Publish Date - 2022-04-24T07:04:28+05:30 IST

నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు త్వరలో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా తెలిపారు.

ప్రజా రవాణా లేదా సైకిల్‌ వినియోగం

వారంలో ఒకరోజు తప్పనిసరి

జీవీఎంసీ నుంచే అమలుచేస్తాం

కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా

కాలుష్య నియంత్రణకు చర్యలు

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగిస్తాం


విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో  కాలుష్యాన్ని నియంత్రించేందుకు త్వరలో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా తెలిపారు. స్మార్ట్‌ సిటీ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0లో జీవీఎంసీ 4 స్టార్‌ రేటింగ్‌ పొందింది. సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుని నగరానికి వచ్చిన ఆయన శనివారం తన ఛాంబర్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలో కాలుష్య నివారణకు జీవీఎంసీ నుంచే చర్యలు ప్రారంభించాలని నిర్ణయించానన్నారు. అందులో భాగంగా గతంలో జీవీఎంసీ అమలుచేసిన ప్రజా రవాణా, సైక్లింగ్‌ విధానాన్ని తిరిగి అమలులోకి తేనున్నట్టు తెలిపారు. వారంలో ఒకరోజు జీవీఎంసీ ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో కాకుండా బస్సు, ఆటో వంటి ప్రజా రవాణా లేదా సైకిల్‌పై విధులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీచేస్తానన్నారు. దీనివల్ల ఇంధన వినియోగంతోపాటు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. బీచ్‌రోడ్డుతోపాటు మరికొన్ని ప్రధాన మార్గాల్లో సైక్లింగ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. పర్యావరణ నిర్వాహణలో ఫైవ్‌ స్టార్‌ దక్కితే విదేశాలకు చెందిన పర్యావరణ సంస్థల నుంచి నిధులు వస్తాయని, ప్రస్తుతం జీవీఎంసీ 4 స్టార్‌లో ఉన్నందున...ఆ దిశగా మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. నాన్‌ మోటరైజ్డ్‌ ట్రాన్సుపోర్ట్‌, నాన్‌ రెవెన్యూ వాటర్‌ అంశాల్లో పురోగతి సాధించేందుకు క్లైమేట్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అమలుచేయాలని నిర్ణయించామన్నారు. గాలి, వెలుతురు పుష్కలంగా లోపలకు వచ్చేలా గ్రీన్‌బిల్డింగ్‌ కాన్సెప్ట్‌లో భవన నిర్మాణాలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ భవనాలను గ్రీన్‌ బిల్డింగ్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణ కారణంగా కొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని,  ఆక్రమణలు తొలగింపు కోసం పోలీస్‌ శాఖతో కలిసి నిరంతరం డ్రైవ్‌ సాగిస్తామన్నారు. జీవీఎంసీ కృషికి ప్రజల భాగస్వామ్యం, సహకారం కూడా తోడైతే ఉత్తమ ఫలితాలను సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. జీవీఎంసీలోని పారిశుధ్య కార్మికుల సంఖ్య కంటే 30 శాతం తక్కువ కార్మికులను కలిగిన ఇండోర్‌, సూరత్‌ వంటి నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్‌-5లో నిలవడానికి అక్కడ ప్రజల సహకారమే కారణమన్నారు. సూరత్‌లో ప్రజలపై భారం పడకుండా పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించి, ఆ రోడ్ల మధ్యన, పక్కన హోర్డింగ్‌లు పెట్టుకుని ప్రైవేటు సంస్థలు ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.


క్రికెట్‌ సందడి

జూన్‌ 14న భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య టీ 20 మ్యాచ్‌

విశాఖపట్నం (స్పోర్ట్సు), ఏప్రిల్‌ 23: భారత్‌, దక్షిణాఫ్రికా  క్రికెట్‌ జట్ల మధ్య నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జూన్‌ 14న అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ జరగనున్నది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. గత నెలలో ప్రకటించిన షెడ్యూల్‌లో జూన్‌ 12న జరిగే రెండో టీ20 మ్యాచ్‌ను విశాఖకు కేటాయించినట్టు బీసీసీఐ వెల్లడించింది. శనివారం విడుదల చేసిన తుది షెడ్యూల్‌లో జూన్‌ 14న జరిగే మూడో మ్యాచ్‌కు విశాఖను వేదిక చేయడం గమనించదగ్గ విషయం. సుమారు మూడేళ్ల తర్వాత విశాఖలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొనే అవకాశాలున్నాయి. 


ఇద్దరు సీఐల బదిలీ 

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు సీఐలను అంతర్గత బదిలీ చేస్తూ సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న ఆర్‌వీఆర్‌కె చౌదరిని ఈస్ట్‌ ట్రాఫిక్‌-1 సీఐగా అటాచ్‌మెంట్‌ ఇచ్చారు. అక్కడ పనిచేస్తున్న వై.గోపీనాథ్‌ను పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు బదిలీ చేశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేస్తున్న బంగారుపాపను రేంజ్‌కు సరండర్‌ చేసినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం పేర్కొనలేదు. 


ఆరుగురు ఎస్‌ఐలు కూడా... 

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఆరుగురు ఎస్‌ఐలను  బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కె.రవికిషోర్‌ను కంచరపాలెం లా అండ ఆర్డర్‌కు, సీసీఎస్‌ స్టేషన్‌లో అటాచ్‌మెంట్‌లో వున్న డి.శ్రీనివాసరావును మహరాణిపేట  స్టేషన్‌కు, టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న జి.రవికుమార్‌ను గాజువాక లా అండ్‌ ఆర్డర్‌కు, మహారాణిపేట స్టేషన్‌లో పనిచేస్తున్న టి.దివ్యజ్యోతిని సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌కు, కంచరపాలెం స్టేషన్‌లో పనిచేస్తున్న వి.రిషికేశ్వరరావును సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌కు, గాజువాక స్టేషన్‌లో పనిచేస్తున్న కె.శంకరరావును టాస్క్‌ఫోర్స్‌లోని యాంటీ నార్కోటిక్‌ సెల్‌కు బదిలీ చేశారు.

Read more