అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రిని వీడేందుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-10-03T05:19:41+05:30 IST

అసలే ఎనిమిదో కాన్పు.. ఆపై తీవ్ర రక్తహీనత.. అనారోగ్యంతో ఉన్నా చికిత్సకు నిరాకరించి స్వగ్రామానికి వెళ్లిపోవడానికి సిద్ధపడిందో బాలింత.

అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రిని వీడేందుకు సన్నద్ధం
బాలింత సోని, ఆమె భర్త అర్జున్‌తో చిన్న పిల్లల వైద్య నిపుణుడు నరేశ్‌

- కామెర్ల బారిన పడిన శిశువుతో వెళ్లిపోయేందుకు సిద్ధమైన బాలింత

- గుర్తించి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసిన వైద్యుడు

- తల్లీబిడ్డకు ప్రమాదమని నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక

- కౌన్సెలింగ్‌ ఇచ్చి చికిత్స అందిస్తున్న వైనం

చింతపల్లి, అక్టోబరు 2: అసలే ఎనిమిదో కాన్పు.. ఆపై తీవ్ర రక్తహీనత.. అనారోగ్యంతో ఉన్నా చికిత్సకు నిరాకరించి స్వగ్రామానికి వెళ్లిపోవడానికి సిద్ధపడిందో బాలింత. ఆమె భర్త అందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయాన్ని గమనించిన చిన్నపిల్లల వైద్య నిపుణుడు సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి వారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోకుండా అడ్డుకున్నారు. గూడెంకొత్తవీధి ధారకొండ పంచాయతీ వర్తొండపాడు గ్రామానికి చెందిన పాంగి సోని(45)కి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌లో మూడు రోజుల క్రితం చింతపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి ఆమె మగ శిశువుకి జన్మనిచ్చింది. ఆమెకు ఇది ఎనిమిదో కాన్పు. మొదటి భర్త వద్ద ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పాంగి అర్జున్‌(50)ని వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైంది. హెచ్‌బీ కేవలం 6 శాతం ఉండడంతో వైద్యులు ఒక యూనిట్‌ రక్తం ఎక్కించారు. మరో యూనిట్‌ పెట్టేందుకు ఏర్పాటు చేశారు. పుట్టిన బిడ్డకు పచ్చకామెర్లు రావడంతో ఎస్‌ఎన్‌సీయూలో ఫొటోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా శిశువుతో పాటు స్వగ్రామానికి వెళ్లిపోయేం దుకు ఆ దంపతులు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు నరేశ్‌ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపోకుండా అడ్డుకున్నారు. తాము వెళ్లిపోవాల్సిందేనని డాక్టర్‌తో ఆ దంపతులు వాదనకు దిగారు. ఇంటికి వెళ్లిపోతే తల్లీబిడ్డకు ప్రమాదమని వైద్యుడు చెప్పినా వినలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని డాక్టర్‌ హెచ్చరించడంతో వారు మిన్నకుండిపోయారు. వారికి పరిస్థితిని వివరించి తల్లీబిడ్డకు చికిత్స అందిస్తున్నారు.

Read more