ప్రజల్లోకి వైసీపీ వైఫల్యాలు

ABN , First Publish Date - 2022-08-25T06:37:42+05:30 IST

గడచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, పాలనలో అవినీతి, దౌర్జన్యాలు, బెదిరింపులు, పెరిగిన అప్పులు, ధరల పెరుగుదల, పన్నుల పెంపును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది.

ప్రజల్లోకి వైసీపీ  వైఫల్యాలు

పొటోలు: విజయ్‌

రైటప్‌: సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న నిమ్మకాయల చినరాజప్ప


తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయం

పాలనలో అవినీతి, ధరల పెరుగుదల,

పన్నుల పెంపు, రహదారుల దుస్థితిని ఎండగట్టాలి

నగరంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై కలసికట్టుగా పోరాటం

సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు,

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ

తనకు నలుగురైదుగురు నేతలు సహకరించడం లేదని మాడుగుల ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ ఫిర్యాదు

ఆ సమస్యను అధిష్ఠానం పరిష్కరిస్తుందన్న

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్ప

 

విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

గడచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, పాలనలో అవినీతి, దౌర్జన్యాలు, బెదిరింపులు, పెరిగిన అప్పులు, ధరల పెరుగుదల, పన్నుల పెంపును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. బుధవారం పార్టీ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశం ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు వంటి అంశాలపై చర్చ సాగింది.  ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమావేశం తీర్మానించింది. ఇంకా పాడైన రోడ్లు, పెరిగిన ధరలు, కరెంట్‌ చార్జీల పెంపు, పాఠశాలల విలీనం, పంచాయతీల నిర్వీర్యం, సర్పంచులను కాదని వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు విలువ ఇవ్వడం, పరిమితికి మించి అప్పులు చేయడాన్ని ఎండగట్టాలని, చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డిల పాలన మధ్య తేడాను ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో గల్లంతైన వారి పేర్లు తెలుసుకుని తిరిగి చేర్పించాలని సూచించారు. కమిటీల ఏర్పాటు సమయంలో నియోజకవర్గ ఇన్‌చార్జులను సంప్రతించి వారి ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని, కమిటీల ఏర్పాటును త్వరలో పూర్తిచేస్తామన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిస్తున్నందున ప్రతి నాయకుడు అప్రమత్తం కావాలన్నారు. జీవీఎంసీలో టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ప్రొటోకాల్‌ అమలుపై గట్టిగా పోరాటం చేయాలని ప్రతిపాదించగా సమావేశం ఆమోదం తెలిపింది. కమిటీల ఏర్పాటులో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరగా భీమిలి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు జోక్యం చేసుకుని 98వ వార్డులో ఒకరిని కమిటీలో నియమిస్తే ఇప్పటివరకు ఒక్క సమావేశానికి రాలేదని ఫిర్యాదుచేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తున్నామన్నారు. 

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుతోపాటు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం చురుగ్గా సాగుతుందని వివరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామన్నారు. పార్టీ కార్యదర్శి వీఎస్‌ఎన్‌ మూర్తియాదవ్‌ మాట్లాడుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్లను ఎమ్మెల్యే విస్మరిస్తున్నారని ఫిర్యాదుచేశారు. మల్కాపురం ప్రాంతంలో పార్టీ కార్పొరేటర్‌ గల్లా చిన్నా వైసీపీ సమావేశాలకు హాజరవుతున్నారని చెప్పడంతో చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావును చినరాజప్ప ఆదేశించారు. జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్‌చార్జులు కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కార్పొరేటర్లను భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రొటోకాల్‌ విషయంలో తనపై కూడా అధికార పార్టీ దాడులకు పాల్పడుతుందని పేర్కొంటూ, ఈ విషయంలో అందరు కలిసి పోరాడాలన్నారు. దీనిపై విశాఖ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ స్పందిస్తూ జీవీఎంసీ సమావేశాలకు ముందు నిర్వహించే షాడో సమావేశాలకు తమను ఆహ్వానించాలని సూచించగా అందుకు ఆయన అంగీకరించారు. మాడుగుల ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో నలుగురైదుగురు నాయకులు సహకరించడం లేదని ఫిర్యాదుచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని తాను కోరడం లేదని, కలిసి పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలనగా చినరాజప్ప స్పందిస్తూ, మాడుగుల వ్యవహారం అధిష్ఠానం వద్ద ఉందని, త్వరలో చక్కదిద్దుతామన్నారు. పార్టీ నాయకుడు ఎంవీ శ్రీభరత్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో పార్టీ సమాచారం, ఇతరత్రా వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకించి ఒక గ్రూపు ఏర్పాటుచేశామన్నారు. ఎప్పటికప్పుడు వివరాలు ఆ గ్రూపులో అప్‌లోడ్‌ చేయాలన్నారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే అప్పల నరసింహరాజు మాట్లాడుతూ రోడ్లు దుస్థితిపై ప్రజలకు వివరించాలన్నారు. ఇంకా పాఠశాలల మూతను వ్యతిరేకించాలని సూచించారు. ఎస్‌.కోట, చోడవరం, అనకాపల్లి ఇన్‌చార్జులు కోళ్ల లలితకుమారి, బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, పెందుర్తి నుంచి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతోపాటు బాదుడే బాదుడు కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. పార్టీ కార్యదర్శి పుచ్చా విజయకుమార్‌ మాట్లాడుతూ పార్టీ పదవుల్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, విశాఖ ఉత్తర ఇన్‌చార్జి చిక్కాల విజయ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్‌, రాజమండ్రి నారాయణ, ఒమ్మి సన్యాసిరావు, పాశర్ల ప్రసాద్‌, గంటా నూకరాజు, గాడు చిన్నికుమారిలక్ష్మి, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, గొలగాని మంగవేణి, ఆరేటి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more