పదవి భార్యది.. పెత్తనం భర్తది..!

ABN , First Publish Date - 2022-11-24T01:34:16+05:30 IST

పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది అన్నచందాన తయారైంది మునగపాక మండలంలో పరిస్థితి. ఇందుకు తాజాగా జరిగిన ఓ సమావేశమే ఉదాహరణ.

పదవి భార్యది.. పెత్తనం భర్తది..!
సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్‌ భర్త కోటేశ్వరరావు

మునగపాక, నవంబరు 23 : పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది అన్నచందాన తయారైంది మునగపాక మండలంలో పరిస్థితి. ఇందుకు తాజాగా జరిగిన ఓ సమావేశమే ఉదాహరణ. మండలంలోని తోటాడ పంచాయతీలో మంగళవారం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల నిమిత్తం సమావేశం ఏర్పాటైంది. సభాధ్యక్ష స్థానంలో సర్పంచ్‌ దొడ్డి మంగవేణి ఉన్నారు. కానీ ఆమెకు మాట్లాడే అవకాశం లేకపోయింది. ఆమె భర్త కోటేశ్వరరావు ఆమె పక్కనే కూర్చొని సర్వం తానై నడిపించారు. ఇది చూసినవారు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మండలంలో మొత్తం 26 పంచాయతీ ఉండగా, 13 పంచాయతీల్లో సర్పంచ్‌లు మహిళలే. మండల సమావేశాల్లోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ వారికన్నా, వారి కుటుంబ సభ్యులే చక్రం తిప్పుతున్నారు. మహిళలకు రాజకీయ అనుభవం అంతగా ఉండదు కనుక తెరవెనుక ఉండి ఆమెను నడిపించాలే తప్ప, ఇలా బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అధికారుల పాత్ర తక్కువేం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారిక కార్యక్రమాలకు ఇటువంటి సూపర్‌ సర్పంచ్‌లు వస్తే వారే రెడ్‌ కార్పేట్‌ పరుస్తుండడం విశేషం. ఈ తతంగాన్ని చూసినవారంతా ఈ మాత్రం దానికే మహిళా సాధికారిత, మహిళలకు రిజర్వేషన్లు, పెద్ద పీట అనే పెద్దపెద్ద పదాలను పాలకులు తరచూ వాడడం ఎందుకని పలువురు ఆక్షేపిస్తున్నారు.

Updated Date - 2022-11-24T01:34:16+05:30 IST

Read more