స్పందన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

ABN , First Publish Date - 2022-11-12T00:51:44+05:30 IST

స్పందన కార్యక్రమంలో గిరిజనులు సమర్పించిన అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

స్పందన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
స్పందనలో అర్జీలు అందజేయడానికి బారులు తీరిన గిరిజనులు, వేదికపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

స్పందన కార్యక్రమంలో 118 వినతుల స్వీకరణ

పాడేరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమంలో గిరిజనులు సమర్పించిన అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవో రోణంకి గోపాలక్రిష్ణతో కలిసి శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమ సమస్యలను అధికారులు తీరుస్తారనే నమ్మకంతో గిరిజనులు ఎంతో దూరం నుంచి పాడేరు వచ్చి వినతిపత్రాలను అందిస్తున్నారని, అందువల్ల వారి సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కాగా శుక్రవారం నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి 118 వినతులను అధికారులు స్వీకరించారు.

చింతపల్లి మండలం బెన్నవరం ప్రాంతానికి చెందిన గిరిజనులు, తాము సాగు చేసుకుంటున్న భూములకు అటవీ హక్కులు కల్పించాలని కోరారు. హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్‌ స్తంభాలు వేయాలని సర్పంచ్‌, పలువురు గిరిజనులు విజ్ఞప్తి చేశారు. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ సల్దిగెడ్డ గ్రామానికి తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరగా, పెదబయలు మండలం సీతగుంట గ్రామంలో తాగునీటి పథకం ద్వారా ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయాలని అర్జీలు అందజేశారు. పాడేరు మండలం వంజంగి గ్రామానికి చెందిన శాంతికుమారి, తనకు ఆశా కార్యకర్తగా అవకాశం కల్పించాలని కోరింది.

లబ్ధిదారులకు రుణాల చెక్కులు చెక్‌లు పంపిణీ

ముగ్గురు లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకాల రుణాల చెక్కులను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ చెక్‌లను అందించారు. పిండిమిల్లు ఏర్పాటు కోసం మినుములూరుకు చెందిన ఎల్‌.చిట్టమ్మకు రూ.6.47 లక్షలు, చిరుధాన్యాల మిల్లుల ఏర్పాటుకు హుకుంపేట మండలం తడిగిరి గ్రామానికి చెందిన పి.నిరోషకు రూ.2 లక్షలు, శోభకోట గ్రామానికి చెందిన పి.భవానీకి రూ.2 లక్షల రుణాలను అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, డీఈవో పి.రమేశ్‌, టీడబ్ల్యూ డీడీ ఐ.కొండలరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరంబాబు, డీఎంహెచ్‌వో జమాల్‌బాషా, ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:51:48+05:30 IST