-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » palanalo ycp prabhutwam vifalam-NGTS-AndhraPradesh
-
పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2022-04-24T06:19:40+05:30 IST
రాష్ట్రంలో ప్రస్తుత పాలకపక్షంపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, ఈ నేపథ్యంలో తిరిగి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టేశారు
ప్రజల్లోకి రావడానికి సీఎం భయపడుతున్నారు
ఆయనపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత పాలకపక్షంపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, ఈ నేపథ్యంలో తిరిగి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో తెలుగునాడు విద్యార్థి విభాగం (టీఎన్‌ఎస్‌ఎఫ్) నేతృత్వంలో నిర్వహించిన చంద్రన్న నాయకత్వ నిర్మాణ్ వర్క్‌షాపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని అయ్యన్న విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో పాలనలో విఫలమైందన్నారు. ప్రజల్లోకి రావడానికి ముఖ్యమంత్రికి ధైర్యం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సన్నాసులంతా జగన్ కేబినెట్‌లో వున్నారని విమర్శించారు. తుస్‌తుస్ అంటూ మాట్లాడే బొత్స సత్యనారాయణకు విద్యా శాఖ ఇవ్వడమేమిటని, ఆయనకు పంచాయతీరాజ్ శాఖ ఇవ్వాలి కదా అని అన్నారు. అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ కాకుండా మాంసమో, చీకులో...మల్లెపూలో అమ్ముకునేందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, దానిని కట్టబెట్టవలసిందని అన్నారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఇచ్చిన హామీని గుర్తుచేసిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తెలుగుదేశంలో పనిచేయడం ఒక అదృష్టమని... బతికినంతకాలం తాను టీడీపీలోనే ఉంటానన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో పనులు చేశాం గానీ...వాటిని చివరకు ప్రజలకు చెప్పలేకపోయామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలనా వైఫల్యం, అవినీతి, నిరుద్యోగం, అభివృద్ధిలో తిరోగమనాన్ని ప్రజలకు వివరించాలని తెలుగునాడు విద్యార్థి విభాగానికి ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో పార్టీకి యువరక్తం అవసరమని, సీనియర్లకు 40 శాతం, యువతకు 60 శాతం టికెట్లు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. పదవులపై తనకు మోజులేదని, పార్టీ బలపడితే చాలునని ఆయన తెలిపారు.