పాడేరు రింగురోడ్డుకు మోక్షం

ABN , First Publish Date - 2022-10-04T06:55:21+05:30 IST

పాడేరు నుంచి లగిశపల్లి, గురుపల్లి మీదుగా కిండంగి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర అధ్వానంగా వున్న రింగు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

పాడేరు రింగురోడ్డుకు మోక్షం

అభివృద్ధి పనులకు రూ.1.44 కోట్లు మంజూరు

15 ఏళ్ల తరువాత మరమ్మతు

వర్షాలు పడకపోతే నెల రోజుల్లో పూర్తి చేస్తామంటున్న పీఆర్‌ అధికారులు


(ఆంధ్రజ్యోతి- పాడేరు) 

పాడేరు నుంచి లగిశపల్లి, గురుపల్లి మీదుగా కిండంగి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర అధ్వానంగా వున్న రింగు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ రహదారి అభివృద్ధి కోసం రూ.1.44 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇటీవల పనులు పీఆర్‌ అధికారులు మొదలు పెట్టారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితే మరో నెల రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.  

పాడేరు-చింతపల్లి మార్గంలో సెయింట్స్‌ ఆన్స్‌ స్కూల్‌ కూడలి నుంచి పాడేరు-విశాఖపట్నం మార్గంలో కిండంగి పంచాయతీ కేంద్రం వరకు ఆరు కిలోమీటర్ల మేర రింగురోడ్డు ఉంది. పాడేరు, లగిశపల్లి, కాడెలి, వంజంగి, కిండంగి పంచాయతీలకు చెందిన గ్రామాలకు ఇది ప్రధాన రహదారి. ఇంకా జి.మాడుగుల మండలంతోపాటు చింతపల్లి మండలంలో కొన్ని పంచాయతీల ప్రజలు విశాఖ, చోడవరం, అనకాపల్లి వెళ్లాలంటే పాడేరు పట్టణంలోకి రాకుండా ఈ మార్గంలో వెళుతుంటారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన వంజంగి హిల్స్‌ను సందర్శించడానికి విశాఖ వైపు నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ మార్గంలోనే వెళుతుంటారు. దీంతో కొంతకాలం నుంచి రింగురోడ్డులో వాహనాల రద్దీ పెరిగింది. కాగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖకు చెందిన ఈ రోడ్డు సుమారు 15 ఏళ్ల నుంచి కనీస అభివృద్ధికి నోచుకోలేదు. గోతులు సైతం పూడ్చకపోవడంతో నానాటికీ అధ్వానంగా తయారైంది. రాత్రిపూట ద్విచక్రవాహనదారులు గోతుల వద్ద ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారిని బాగు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. 

ఎట్టకేలకు మోక్షం

స్థానిక రింగు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆరు కిలోమీటర్ల పొడవు వున్న ఈ రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ.1.44 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల మెటల్‌, క్రషర్‌ బుగ్గితో గోతులు పూడ్చే పనులు మొదలుపెట్టారు. అనంతరం బీటీ రోడ్డు వేస్తారు. వర్షాలు కురవకపోతే మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.


Read more