చట్టం పరిధిలోనే ఆన్‌లైన్‌ వినియోగదారులు

ABN , First Publish Date - 2022-03-16T05:55:21+05:30 IST

ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తారని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) జి.సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏవీఎన్‌ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

చట్టం పరిధిలోనే ఆన్‌లైన్‌ వినియోగదారులు
సదస్సులో మాట్లాడుతున్న డీఎస్‌ఓ జి సూర్యప్రకాశరావు

డీఎస్వో సూర్యప్రకాశరావు 

విశాఖపట్నం, మార్చి 15: ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తారని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) జి.సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏవీఎన్‌ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మేలైన డిజిటల్‌ వ్యవస్థే లక్ష్యమనే అంశంపై ఆయన మాట్లాడుతూ వస్తుసేవల్లో నష్టపోయిన బాధితులు వినియోగదారుల రక్షణ చట్టంతో న్యాయం, నష్ట పరిహారం పొందవచ్చునన్నారు. నగదు చెల్లించి కొనుగోలు చేసిన వస్తు సేవల్లో కష్టనష్టాలు ఎక్కడ జరిగినా వినియోగదారుడు నివశించే ప్రదేశాల్లో ఉన్న వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. డిజిటల్‌ లావాదేవీల్లో నూతన సాంకేతిక పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి (గ్రామీణ) రొంగలి శివప్రసాద్‌ మాట్లాడుతూ వస్తువు నాణ్యతా ప్రమాణాల బాధ్యత ఉత్పత్తిదారులు, విక్రేతలపై ఉందన్నారు.  ఏదైనా సేవలను పొందినప్పుడు కలిగే కష్ట నష్టాలకు వాటిని అందజేసిన వారే బాధ్యులవుతారని స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టం, పౌరసరఫరాల సేవల ప్రాధాన్యతలు వివరించారు. సదస్సుకు సెట్విజ్‌  సీఈవో పి.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కన్జ్యూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, ఏవీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సింహాద్రినాయుడు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కె.సువర్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T05:55:21+05:30 IST