కొనసాగుతున్న ముసురు

ABN , First Publish Date - 2022-07-05T06:33:17+05:30 IST

గత వారం రోజులుగా మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది.

కొనసాగుతున్న ముసురు
పాడేరు మెయిన్‌ రోడ్డులో వర్షం

పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు 


పాడేరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గత వారం రోజులుగా మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. సోమవారం సైతం ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. పాడేరులో సోమవారం ఉదయం ఒక మోస్తరుగా వాన కురిసింది. పది గంటల తరువాత తెరిపి ఇచ్చినప్పటికీ ఎండ కాయలేదు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వర్షానికి రోడ్లు తడిసి ముద్దయ్యాయి. పాడేరు నుంచి అరకులోయకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న రోడ్డంతా బురదగా మారడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అనంతగిరి మండలంలోని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో ఒక మోస్తరుగా, పెదబయలులో భారీ వర్షం కురిసింది. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాల్లోనూ ముసురు ప్రభావం కొనసాగింది. 


ముంచంగిపుట్టులో..  

ముంచంగిపుట్టు:  మండల పరిధిలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. రహదారులు జలమయమయ్యాయి. మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, సంగడ, లక్ష్మీపురం, పెదబయలు, కుమడ, బూసిపుట్టు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది. 


సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వర్షానికి దుర్గావీధి, అల్లూరివీధుల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు చేరింది. దీని వల్ల ఆయా ప్రాంతవాసులు ఇబ్బందులు పడ్డారు. 

Updated Date - 2022-07-05T06:33:17+05:30 IST