కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-10-11T06:45:12+05:30 IST

కల్యాణఫులోవ రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది.

కొనసాగుతున్న వరద ప్రవాహం
కోనాం మెయిన్‌గేటు ద్వారా విడుదలవుతున్న నీరు

కల్యాణపులోవ నుంచి 220 క్యూసెక్కులు విడుదల

రావికమతం, అక్టోబరు 10: కల్యాణఫులోవ రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. దీంతో గురువారం నుంచి నిరంతరం రెండు గేట్లు ఎత్తి నీటిని విడిచి పెడుతున్నప్పటికీ ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. దీంతో సోమవారం కూడా రెండు గేట్లు ఎత్తి 225 క్యూసెక్కుల వరద నీటిని సర్పా నదిలోకి విడిచి పెట్టారు. 460 అడుగుల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 458.06 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 225 క్యూసెక్కులు చేరుతుండడంతో రెండు గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల వరద నీటిని సర్పానదిలోకి  విడిచి పెడుతున్నామని ఏఈ సత్యనారాయణదొర తెలిపారు.


కోనాం నుంచి 750 క్యూసెక్కుల నీరు విడుదల

చీడికాడ: మండలంలో కోనాం జలాశయానికి ఎగువనున్న ఏజెన్సీ అటవీ ప్రాంతాల నుంచి వరదనీరు పోటెత్తుతున్నది. జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, సోమవారం ఉదయానికి 100.50 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 750 క్యూసెక్కులు కాగా జలాశయం మెయిన్‌గేటు ద్వారా 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ సీహెచ్‌.జయరాం తెలిపారు. 


పెద్దేరు నుంచి 508 క్యూసెక్కుల నీరు విడుదల

మాడుగుల రూరల్‌: మండలంలోని పెద్దేరు జలాశయం నుంచి 508 క్యూసెక్కుల నీటిని సోమవారం అధికారులు విడిచిపెట్టారు.  వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరిగి గరిష్ఠ స్థాయికి చేరువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు జలాశయం అధికారులు నదిలోకి విడిచిపెట్టి నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు. కాగా సోమవారం 698 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 135.70 మీటర్లకి చేరింది. దీంతో జలాశయం ఒక గేటు ఎత్తి 508 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టామని ఏఈఈ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. 


రైవాడ నుంచి రెండు వేల క్యూసెక్కులు..

దేవరాపల్లి, అక్టోబరు 10: మండలంలోని రైవాడ జలాశయంలోకి 1500 క్యూసెక్కుల వరదనీరు చేరడంతో మూడు గేట్లు నుంచి రెండు వేల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేసినట్టు జలాశయ ఏఈఈ సత్యంనాయుడు తెలిపారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా సోమవారానికి 112.75 మీటర్లు నమోదయిందన్నారు.

Read more