రెండు బైకులు ఢీ: ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-12-13T00:53:08+05:30 IST

కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోబోయే వ్యక్తిని బైక్‌ రూపంలో మృత్యువు కబళించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు.

 రెండు బైకులు ఢీ: ఒకరి మృతి
కరణం గిరిబాబు (ఫైల్‌ ఫొటో)

ఎస్‌.రాయవరం, డిసెంబరు 12 : కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోబోయే వ్యక్తిని బైక్‌ రూపంలో మృత్యువు కబళించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి సమీపంలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ భూలోక, స్థానికులు తెలిపిన వివరాలివి. ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన కరణం గిరిబాబు (32), జాగు రమణ ఈ ఇద్దరూ నక్కపల్లి మండలంలో గల హెట్రో కర్మాగారంలో పనిచేస్తున్నారు. గిరిబాబు ప్రతి రోజూ బైక్‌పై జనరల్‌ డ్యూటీకి వెళ్లివస్తుంటాడు. ఎప్పటిలాగే సాయంత్రం అతడు విధులు ముగించికొని అదే గ్రామానికి చెందిన రమణను ఎక్కించుకొని ఏటికొప్పాక వెళుతున్నాడు. రాత్రి ఏడు గంటల సమయంలో అడ్డరోడ్డు నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గం దార్లపూడి సమీపంలో చల్లాపురం జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా మరోబైక్‌ రావడంతో ఈ రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాందలో గిరిబాబు అక్కడికక్కడే దుర్మణం చెందగా, బైక్‌ వెనుక కూర్చొన్న రమణకు, ఎదురుగా బైక్‌పై వచ్చిన దార్లపూడికి చెందిన భీముని తేజాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, ప్రాథమిక చికిత్సల అనంతరం విశాఖ కేజీహెచ్‌ తరలించారు. మృతుడు గిరిబాబుకు భార్య పూర్ణతో పాటు పావని, తనూజ్‌ అనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గిరిబాబు మృతితో ఏటికొప్పాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:53:08+05:30 IST

Read more