భీమిలి-భోగాపురం బీచ్‌ కారిడార్‌కు ఓకే

ABN , First Publish Date - 2022-02-19T06:28:34+05:30 IST

పోర్టు నుంచి ఆర్‌కే బీచ్‌, రుషికొండ మీదుగా భీమిలి వరకు, అక్కడి నుంచి భోగాపురం వరకు బీచ్‌ వెంబడి ఆరు వరుసల రహదారి నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన.

భీమిలి-భోగాపురం బీచ్‌ కారిడార్‌కు ఓకే
భీమిలి నుంచి భోగాపుం వెళ్లే మార్గం

కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

రూ.1,400 కోట్లకు మంజూరుచేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన

మరి...విశాఖ-భీమిలి బీచ్‌ కారిడార్‌ సంగతో?

అటకెక్కినట్టేనా...


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు బీచ్‌ కారిడార్‌ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదం లభించింది. రెండేళ్లుగా అధికార పార్టీ నేతలు ఢిల్లీలో ఈ కారిడార్‌కు అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం దీనికి పచ్చజెండా ఊపారు. మొత్తం రూ.1,400 కోట్లు ఇస్తామని, భూసేకరణకు కూడా ఆ నిధులు ఉపయోగించాలని సూచించారు. అయితే ఇందులో స్పష్టత రావల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.


విశాఖ పోర్టు నుంచి మొదలు

విశాఖపట్నం పోర్టు నుంచి ఆర్‌కే బీచ్‌, రుషికొండ మీదుగా భీమిలి వరకు, అక్కడి నుంచి భోగాపురం వరకు బీచ్‌ వెంబడి ఆరు వరుసల రహదారి నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దీనిని రెండు బిట్లుగా విభజించారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు ఒక బిట్‌, భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మరో బిట్‌. ఇప్పుడు భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు వేసే కారిడార్‌కు కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటించింది. మరి విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు ఎక్కడి  నుంచి నిధులు తెస్తారనేది తేలాల్సి ఉంది. 


పెండింగ్‌లో సర్వే

విశాఖపట్నం పోర్టు నుంచి సరకులతో లారీలు వెళ్లడానికి బీచ్‌ కారిడార్‌ ఉపయోగపడుతుందని, దానికి సాగరమాల ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరింది. సరకు రవాణాకు ఈ మార్గం ఎంతవరకు ఉపయోగపడుతుంది?, ఆ మార్గంలో వెళ్లే వాహనాలు ఎన్ని?, సరకుల పరిమాణం ఎంత?...అనే దానిపై అధ్యయనం చేసి, అప్పుడు పరిశీలిస్తామని మూడు నెలల క్రితం కేంద్రం స్పష్టం చేసింది. ఆ సర్వే ఇంకా చేపట్టనే లేదు.  


పర్యాటకమా? సరకు రవాణానా?

ఈ బీచ్‌ కారిడార్‌ పర్యాటకానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. అయితే విశాఖ పోర్టు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సరకు రవాణాకు కూడా ఈ మార్గం ఉపయోగించుకోవచ్చునని అంటోంది. అయితే, సరకు రవాణాకు జాతీయ రహదారి నంబరు 16 ఇప్పటికే ఉంది. దానిని అనకాపల్లి నుంచి ఆనందపురం-భోగాపురం మీదుగా శ్రీకాకుళం వరకు ఆరు వరుసలుగా అభివృద్ధి చేశారు. దానిని వదిలేసి బీచ్‌ రోడ్డులో సరకు రవాణా చేయడం దాదాపు దుర్లభం. సాగరమాల కింద నిధులు సమీకరించడానికే సరకు రవాణా అంటున్నారని, అది ఈ బీచ్‌ కారిడార్‌లో సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


బాధ్యతలు కూడా వేర్వేరు

రాష్ట్ర ప్రభుత్వం ఈ బీచ్‌ కారిడార్‌ను రెండు బిట్లుగా విభజించి, వాటి నిర్మాణ బాధ్యతలను రెండు సంస్థలకు అప్పగించింది. విశాఖపట్నం పోర్టు నుంచి కైలాసగిరి వరకు జీవీఎంసీకి, అక్కడి నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు వీఎంఆర్‌డీఏకి అప్పగించింది. ప్రస్తుతం జీవీఎంసీ తనకు అప్పగించిన మార్గంపై ఎటువంటి కసరత్తులు చేయడం లేదు. పోర్టు నుంచి కైలాసగిరి వరకు వున్న బీచ్‌ మార్గం చాలా కీలకమైనది. దానిని ఆరు వరుసలుగా విస్తరించాలంటే...ఆర్కే బీచ్‌రోడ్డులో ప్రైవేటు భవనాలు చాలా తొలగించాల్సి వస్తుంది. పైగా అక్కడ ప్రముఖుల విగ్రహాలు టీయూ-142 సబ్‌మెరైన్‌ మ్యూజియాలు, రాజీవ్‌ స్మృతిభవన్‌, నేవీ అమరవీరుల స్థూపం వంటివి ఉన్నాయి. వాటిని తొలగించి అభివృద్ధి చేసే అవకాశం లేదు. ఇక్కడ రహదారి విస్తరణ క్లిష్టమైనది. భూసేకరణకు సిద్ధపడితే భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం ఈ మార్గం ప్రస్తావన తేకుండా భీమిలి-భోగాపురం కారిడార్‌కే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 


వీఎంఆర్‌డీఏ సన్నాహాలు

భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 20.19 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ ప్రతిపాదనలు రూపొందించింది. దీనిని 70 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. భీమిలి బీచ్‌ మీదుగా కారిడార్‌ వేస్తే సమస్యలు వున్నాయని నేరేళ్లవలస దగ్గర దారి మళ్లించారు. పేరుకు బీచ్‌ కారిడార్‌ అయినా...ఇక్కడ బీచ్‌  పక్కన రోడ్డు వేసే అవకాశం లేదు. ఈ మార్గం కోసం మొత్తం 700 ఎకరాలు సేకరించాల్సి ఉంది. తొమ్మిది గ్రామాల్లో 346 ఎకరాల ప్రైవేటు భూమికి పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ కారిడార్‌కు రూ.942 కోట్లు వ్యయం అవుతుందని వీఎంఆర్‌డీఏ అంచనాలు రూపొందించింది. కేంద్రం నుంచి దీనికి నిధులు వస్తాయని గట్టి నమ్మకం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం భీమిలి-భోగాపురం బీచ్‌కారిడార్‌కు ప్రాథమికంగా రూ.67 కోట్లు మంజూరుచేసింది. వాటితో పనులు ప్రారంభించడానికి వీఎంఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ కారిడార్‌ భీమిలి-భోగాపురం వరకే నిర్మితమవుతుందనేది ప్రస్తుతానికి సుస్పష్టం. 

Read more