16 మంది ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నోటీసులు

ABN , First Publish Date - 2022-12-02T01:18:44+05:30 IST

వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎం ఫారిన్‌ సర్వీసు (పొరుగు సేవ) వ్యవహారంలో 16 మంది అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

16 మంది ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నోటీసులు

ఏఎన్‌ఎంకు రీపోస్టింగ్‌ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు

వివరణ తీసుకున్న అనంతరం విచారణ

విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎం ఫారిన్‌ సర్వీసు (పొరుగు సేవ) వ్యవహారంలో 16 మంది అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాగా వున్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే భూలోక అనే ఏఎన్‌ఎం ఎక్కువ జీతం వస్తుందనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రంలోని మాచ్‌ఖండ్‌ పరిధిలోని జోలాపుట్‌ పీహెచ్‌సీకి వెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్యోగి ఫారిన్‌ సర్వీస్‌కు ఐదేళ్లు మాత్రమే అవకాశం ఇవ్వాలి. కానీ ఆమె ఏకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లు ఒడిశాలో పనిచేశారు. పదోన్నతులు ఇస్తున్నారని తెలిసి కొన్నాళ్ల క్రితం పాడేరు డివిజన్‌లో చేరేందుకు తిరిగివచ్చారు. అయితే సుదీర్ఘకాలం ఫారిన్‌ సర్వీసులో ఉండి వచ్చిన ఆమెకు అప్పటి పాడేరు అడిషనల్‌ డీఎంహెచ్‌వో నిబంధనలు పాటించకుండా...జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయకుండా డివిజన్‌లో ఖాళీగా వున్న పీహెచ్‌సీలో రీపోస్టింగ్‌ ఇచ్చారు. రీపోస్టింగ్‌ తీసుకున్న ఏఎన్‌ఎంకు జీతం బిల్లు యథావిధిగా ట్రెజరీకి పెట్టారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా జీతాలు చెల్లించలేమని అప్పటి ట్రైజరీ ఎస్‌టీవో అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఆమె జీతం చెల్లించడం లేదంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగా సదరు ఏఎన్‌ఎంకు రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అధికారులు గుడ్డిగా హెల్త్‌ విజిటర్‌గా పదన్నోతి ఇచ్చేశారు. దీంతో పదోన్నతి ఇచ్చినప్పటికీ జీతం ఇవ్వకపోవడంతో ఆమె మరోసారి ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో ఏం జరిగిందన్న విషయంపై అప్పటి ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ నివేదిక పంపించాలని ఆర్డీని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి ఆర్‌డి స్వరాజ్యలక్ష్మి...డీఎంహెచ్‌వో అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం తీసుకొని నివేదిక తయారుచేసి కమిషనర్‌కు పంపించారు. ఆ నివేదికను పరిశీలించి తప్పు జరిగిందని గుర్తించిన ఆరోగ్య శాఖ కమిషనర్‌ అప్పటి పాడేరు అడిషనల్‌ డీఎంహెచ్‌వోతో పాటు లబ్బూరు పీహెచ్‌సీ సిబ్బంది, పూర్వ డీఎంహెచ్‌వో, అప్పటి ఆర్‌డి, సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌లు, కార్యాలయ సూపరింటెండెంట్‌...ఇలా మొత్తం 16 మందికి వ్యక్తిగతంగా నోటీసులు పంపించారు. ప్రతి ఒక్క ఉద్యోగి వివరణ ఇవ్వాలని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. నోటీసులపై వివరణ ఇచ్చిన అనంతరం పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ నోటీసులపై పదిహేను రోజుల్లో ఆయా ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఆరోగ్యశాఖ ఉద్యోగులకు నోటీసులు, తాజాగా ఏసీబీ దాడులతో ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - 2022-12-02T01:18:45+05:30 IST